రేవంత్ కు రాబిన్ హూడ్ ఇమేజి ?
హైడ్రా రూపంలో రేవంత్ అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలను కూల్చివేతకు శ్రీకారం చుట్టిన తర్వాత రేవంత్ ఇమేజి బాగా పెరిగిపోయిందని చెప్పారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణాలో రాబిన్ హూడ్ ఇమేజి వచ్చిందా ? వచ్చిందనే అంటున్నారు మాజీ ఎంఎల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఒక ఛానల్లో మాట్లాడుతు హైడ్రా రూపంలో రేవంత్ అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలను కూల్చివేతకు శ్రీకారం చుట్టిన తర్వాత రేవంత్ ఇమేజి బాగా పెరిగిపోయిందని చెప్పారు. ఎప్పుడైతే కూల్చివేతలు మొదలయ్యాయో ప్రజల్లో సంతోషం కనబడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని తనకు మద్దతుగా, అనుకూలంగా ర్యాలీ చేయించగలిగారు రేవంత్ అని ప్రొఫెసర్ కితాబు కూడా ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాలన్నింటినీ గందరగోళంలోకి రేవంత్ పడేశారని కూడా చెప్పారు.
హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటే బీజేపీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు ఎందుకు మద్దతిస్తున్నాయంటే జనాల మూడ్ ను చూసే అని అభిప్రాయపడ్డారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబందించి ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్ పోజ్ అవుతున్నట్లు చెప్పారు. అక్రమనిర్మాణాల కూల్చివేతలు ప్రజలకు పెద్దవాళ్ళకు మధ్య ఘర్షణగా మారబోతోందని అంచనా వేశారు. పెద్దలకు-పేదలకు మధ్య ఘర్షణ వస్తే మెజారిటి ప్రజలు పేదలపక్షానే నిలుస్తారని చెప్పారు. కూల్చివేతల అంశం తొందరలోనే పేదలు వర్సెస్ బడాబాబులుగా మారబోతున్నట్లు జోస్యంచెప్పారు.
ప్రజల మూడ్ రేవంత్ కు భారీగా అనుకూలంగా మారబోతోందన్నారు. ప్రతిపక్షాల్లోకాని లేదా స్వపక్షంలో కాని ఎవరైనా రేవంత్ ను ముట్టుకుంటే జనాలు ఒప్పుకునేట్లు లేరన్నారు. బడాబాబుల అక్రమాలు, నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చితే, పెద్దవాళ్ళ ఆక్రమణలను కూల్చేసేందుకు రేవంత్ నిర్ణయం తీసుకుంటే అందరు ఏకమయ్యారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో పెరిగిపోవటం ఖాయమని చెప్పారు. గట్టిగా నిలబడి స్వపక్షంతో పాటు ప్రతిపక్ష నేతల ఫాంహౌసులు, ఆక్రమణలను గనుక తొలగించగలిగితే జనాల్లో రేవంత్ కు రాబిన్ హూడ్ తరహా ఇమేజి పెరిగిపోవటం ఖాయమన్నారు.
అక్రమనిర్మాణాల తొలగింపును, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపును వ్యతిరేకిస్తున్నది ఆక్రమణదారులు, కబ్జాదారులే కాని సామాన్య జనాలు కాదని ప్రొఫెసర్ గుర్తుచేశారు. వివిధ జిల్లాల్లో రేవంత్ నిర్ణయానికి, హైడ్రా యాక్షన్ కు మద్దతు పెరుగుతున్నట్లు ప్రొఫెసర్ గుర్తుచేశారు. కూల్చివేతల్లో కొన్ని సామాన్యుల ఇళ్ళు లేదా అపార్టమెంట్లు కూడా ఉండచ్చని ప్రొఫెసర్ చెప్పారు. రేవంత్ ను డిస్ట్రబ్ చేసేందుకు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరూ ప్రయత్నించినా రేవంత్ హీరో అయిపోతారని జోస్యం కూడా చెప్పారు.