రేవంత్ కేంద్రమంత్రుల మీదకు తోసేశాడా ?
పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే బాధ్యతను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishanreddy), బండి సంజయ్(Bandi Sanjay) తీసుకోవాలని రేవంత్ చెప్పాడు;
స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశాడు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ ఇప్పటికిప్పుడు స్ధానికసంస్ధల ఎన్నికల్లో(Local body elections) చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయటం సాధ్యంకాదని తేల్చిచెప్పేశాడు. 42 శాతం చట్టపరంగా అమలుచేయటం సాధ్యంకాదు కాబట్టే పార్టీపరంగా బీసీ(BC Reservations)లకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయినట్లు చెప్పేశాడు. ఇదే విషయాన్ని మొదటినుండి ‘తెలంగాణ ఫెడరల్’ చెబుతున్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు తీర్పుంది కాబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయటం రేవంత్(Revanth) కు సాధ్యంకాదని తెలంగాణ ఫెడరల్ చెప్పింది. అందుకనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) అమలుచేసినట్లుగా బీసీలకు పార్టీపరంగా పెద్దపీట వేయటం ఒక్కటే రేవంత్ ముందున్న మార్గమని కూడా తెలంగాణ ఫెడరల్ చెప్పింది.
మొదటినుండి తెలంగాణ ఫెడరల్ చెబుతున్న విషయాన్నే రేవంత్ అధికారికంగా మీడియా సమావేశంలో తాజాగా చెప్పాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలంటే పార్లమెంటు(Indian Parliament) ఆమోదం తప్పనిసరిగా చెప్పాడు. మార్చి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచాలని తీర్మానంచేసి కేంద్రప్రభుత్వానికి పంపుతామని చెప్పాడు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే బాధ్యతను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishanreddy), బండి సంజయ్(Bandi Sanjay) తీసుకోవాలని రేవంత్ చెప్పాడు. అంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే బాధ్యతను రేవంత్ ఇద్దరు కేంద్రమంత్రుల మీదకు తోసేశాడు. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించకపోతే కేంద్రమంత్రులే కారణమని రేవంత్ ఫిక్స్ చేయబోతున్నట్లు అనుమానంగా ఉంది.
తమప్రభుత్వం చేసిన కులగణనలో బీసీలు 6 శాతం పెరిగినట్లు తెలిపారు. కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వేలో బీసీలను 4 కేటగిరీల్లో మాత్రమే చూపినట్లు ఆరోపించారు. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతంకాగా మిగిలిన సామాజికవర్గాలను ఓసీలుగా చూపించినట్లు వివరించాడు. తమప్రభుత్వం చేసిన సర్వేలో బీసీలను ఐదు కేటగిరీలుగా చూపించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ సర్వే ప్రకారం హిందు, ముస్లిం, బీసీలంతా కలిపి 56 శాతం ఉన్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే అమలుచేయగలిగిన రిజర్వేషన్లు 28 శాతం మాత్రమే. సుప్రింకోర్టు లెక్క 50 శాతంకు మించకూడదంటే ఇక మిగిలింది 22 శాతం మాత్రమే. 22 శాతం రిజర్వేషన్ల అమలుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ఏ కోణంలో చూసినా సాధ్యంకాదు. అందుకనే చట్టపరంగా 42 శాతం అమలుసాధ్యంకాదు కాబట్టే పార్టీపరంగా అమలుచేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించాడు. చట్టబద్దంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుసాధ్యంకాదని తేలిపోయింది కాబట్టి పార్టీ పరంగా ఎంతశాతం సీట్లిస్తారో చూడాల్సిందే. మరి రేవంత్ ప్రభుత్వం పంపబోతున్న అసెంబ్లీ తీర్మానానికి నరేంద్రమోడీ(Narendra Modi) ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా ?