మీనాక్షి సైలెంటుగా పనికానిచ్చేసిందా ?
కొత్తగా నియమితురాలైన ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పై మామూలుగా లేదు;
కొత్తగా నియమితురాలైన ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పై మామూలుగా లేదు. ఏఐసీసీ ప్రకటించిన ఎంఎల్సీల జాబితాలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. సోమవారం, 10వ తేదీన ఎంఎల్సీల నామినేషన్ దాఖలకు ఆఖరురోజు. ఎంఎల్ఏ కోటాలో ఐదుగురు ఎంఎల్సీల భర్తీకి కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఐదింటిలో నాలుగు కాంగ్రెస్+ మిత్రపక్షం సీపీఐకి, మరోటి బీఆర్ఎస్(BRS) కు దక్కుతుంది. బీఆర్ఎస్ ఒక్కనేతనే ఎంపికచేస్తే మొత్తం ఐదుగురు ఎంఎల్సీ అభ్యర్ధులు ఏకగ్రీవమవుతారు. బీఆర్ఎస్ గనుక రెండో అభ్యర్ధిని నిలిపితే ఎన్నిక తప్పదు.
కాంగ్రెస్ పోటీచేయబోయే మూడు సీట్లకు అద్దంకి దయాకర్(Addanki Dayakar), శంకర్ నాయక్(Sankar Naik), విజయశాంతి(Vijayasanthi) పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. నాలుగో సీటును మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. తమఅభ్యర్ధిని ఎంపికచేయటానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో అద్దండి ఎస్సీ సామాజికవర్గం, శంకర్ నాయక్ ఎస్టీ కాగా విజయశాంతిని మహిళాకోటాలో ఎంపికచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభ్యర్ధులుగా చాలామంది సీనియర్లు గట్టిగా ప్రయత్నించారు. అయితే అందరినీ కాదని ఏఐసీసీ చివరినిముషంలో అద్దంకి, శంకర్, విజయశాంతిని ఎంపికచేయటం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి చాలాకాలంగా ఎంఎల్ఏ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అద్దంకికి టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఎంపీగా, ఎంఎల్ఏగా అద్దంకి చాలాసార్లు టికెట్లను త్యాగం చేయాల్సొచ్చింది. ఇపుడు కూడా ఎస్సీ కోటాలో మాజీ ఎంఎల్ఏ సంపత్ కుమార్ లాంటి బలమైన నేతలనుండి పోటీని ఎదుర్కొన్నారు. అలాగే నల్గొండజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు చివరినిముషంలో ఖరారైంది. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే విజయశాంతి ఎంపిక అందరికీ షాకిచ్చింది. విజయశాంతి పేరును ఏఐసీసీ ఏ ప్రాతిపదికన ఎంపికచేసిందో చాలామంది అర్ధంకావటంలేదు. సీనియర్లు, ఎంఎల్ఏలుగా పోటీచేసి ఓడిపోయిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం వద్దని మీనాక్షి ఏఐసీసీ నేతలకు గట్టిగా చెప్పారని పార్టీవర్గాల సమాచారం.
ఇక్కడే తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి ముద్ర కనబడిందని పార్టీవర్గాల సమాచారం. ఎలాగంటే శంకర్ నాయక్ పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్నా పదవులు ఏవీ పెద్దగా రాలేదు. అందుకనే శంకర్ కోసం సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రయత్నించారు. రేవంత్(Revanth) తో పాటు జానారెడ్డి ఫోన్లో మీనాక్షి(Meenakshi Natarajan)కి శంకర్ గురించి వివరించినట్లు తెలిసింది. అద్దంకి, శంకర్ పేర్లు పీసీసీ సిఫారసుచేసిన ప్రాబబుల్స్ జాబితాలో కూడా ఉన్నాయి. అయితే ఎస్టీ కోటాలో శంకర్ చాలా గట్టి పోటీని ఎదుర్కొన్నారు. అలాగే విజయశాంతికి పార్టీలో చాలాకాలంగా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మీనాక్షి పలువురు నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ సీటు ఇస్తామని హామీ ఇచ్చికూడా చివరినిముషంలో చెయ్యిచ్చారు. దాంతో సినీనటి ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వలేకపోయిన కారణంగా ఎంపీ టికెట్ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది పార్టీ.
అయితే ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ లో నుండి పార్టీలో చేరిన నీలంమధుకు ఎంపీగా టికెట్ దక్కింది. మధుకోసం రేవంత్ గట్టిగా ప్రయత్నించటంతో అధిష్ఠానం కూడా కాదనలేకపోయింది. ఈమధ్యనే రెండు ఎంఎల్సీల నామినేషన్లో కూడా విజయశాంతికి అవకాశం దక్కలేదు. ఈ విషయాలన్నీ మీనాక్షి తెలుసుకున్నారు. అందుకనే ప్రముఖ సినీనటి రెండుసార్లు టికెట్లు కోల్పోవటం, మహిళ అవటంతో విజయశాంతికి అవకాశం ఇవ్వాలని మీనాక్షి అధిష్ఠానానికి సిఫారసు చేసినట్లు సమాచారం. మీనాక్షి సిఫారసు అంటే పార్టీలో తిరుగుండదన్న విషయం తెలిసిందే. రాహుల్ కు అత్యంత సన్నిహిత కోటరీలో మీనాక్షి చాలా కీలకమైన నేత. అందుకనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాదనలేకపోయారు. తమకు అవకాశం కల్పించాలని చాలామంది నేతలు మీనాక్షిని కలిసి విజ్ఞప్తిచేసినా ఈమె మాత్రం శంకర్, విజయశాంతి వైపు మొగ్గారు. అందుకనే ఎవరూ ఊహించని రీతిలో విజయశాంతి పేరు ఖరారైంది. ఈ ముగ్గురు అభ్యర్ధుల పేర్ల ఖరారులోనే మీనాక్షి ముద్ర స్పష్టంగా కనబడుతోంది.