జైలు భయంతోనే జగన్, చంద్రబాబు తెగబడ్డారా?

జగన్, చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందా? అందుకే ఒకర్ని మించి ఒకరు తిట్లూ దీవెనలు, శాపనార్థాలు పెట్టుకుంటున్నారా..

Update: 2024-04-15 03:34 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మహారంజుగా సాగుతోంది. ఏ ప్రాంతీయ పార్టీ గెలిచినా బీజేపీకి దాసోహం అంటున్న రెండు పార్టీల అధినేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. బీజేపీకి టీడీపీకి సంధానకర్తగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎండల్ని, రాళ్లు రప్పల్ని, చెప్పుల్నీ చేటల్నీ లెక్కచేయక, మాడ్చే ఎండల్నీ, ఉన్నట్టుండి దూసుకొచ్చే ఈదురుగాలుల్ని, ఆకస్మిక జల్లుల్నీ లెక్కచేయకుండా రోజుకొక్క ఊరుగా మహాజోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అసలింతకీ రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎందుకింతగా అధికారమే పరమావధిగా ప్రచారాన్ని చేస్తున్నారు. పందెం కోళ్లవలే ఒకర్ని మించి ఒకరు తిట్లూ దీవెనలు, శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇద్దరి మాటల్లో తీవ్రత పెరిగింది. వారి నోటి వెంట తిట్లు వస్తున్నాయి. శపథాలు, శాపనార్థాలు నిప్పు తునకల వలే ఎగిసి పడుతున్నాయి. గెలవాలి, ఎలాగైనా గెలవాలి,గెలుపు తప్ప మరో మార్గం లేదు, గెలుపు కోసం ఏమైనా చేయాలనే ధోరణి ఎందుకు పెరిగిందో అర్థం కావడం లేదు.

మళ్లీ అధికారంలోకి రాకపోతే...

మళ్లీ అధికారంలోకి రాకుంటే తన గతి అధోగతి అనే నిజం ఇద్దరికీ తెలిసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాను గెలవకుంటే మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను జైలు శిక్ష అనుభవించక తప్పదేమో అని ఇరు పార్టీల నాయకులు భావించడమే ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకోసం ఊపిరి బిగబట్టి సర్వశక్తులు ధారబోస్తున్నారు. ఏ ఎత్తుజిత్తుల్నీ ఈ ఇద్దరూ వదిలిపెట్టడం లేదు. ఎవరితో రాజీకైనా వెనుకాడడం లేదు. పవన్ కళ్యాణ్, బిజెపిలతో తెలుగుదేశం పొత్తు నిర్ణయం వెనక ఈ భయం చంద్రబాబు నాయుడులో దాగి ఉంది. సీట్లు తగ్గినా పర్వాలేదు, సంకీర్ణమైన నష్టం లేదు , అధికారంలోకి మాత్రం కచ్చితంగా వచ్చి తీరాలి అనే తలంపుతో చంద్రబాబు నాయుడు తనకు అలవాటు లేని పోకడలు పోతున్నారు. పవన్ ను పవర్ స్టార్ అని పొగుడుతున్నారు, మోదీని దార్శనికుడిగా పోలుస్తున్నారు, అభివృద్ధికి మారుపేరు అంటున్నారు. ఇందుకు జగన్ కూడా ఏమాత్రం తీసుకోవడం లేదు. ఆయనకూ జైలు భయం ఉంది. అప్పుడెప్పుడో సిబిఐ పెట్టిన 11 కేసుల కత్తి మెడ మీద వేలాడుతూనే ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ప్రతి నిర్ణయాన్నీ ఒక కేసుగా మార్చడం సులభమే. ఇసుక మద్యం భూముల కేటాయింపు వంటి అనేక వాటిల్లో ఏదో ఒక ఆధారం దొరక్కపోదు.

పాత కేసులకు కొత్త కేసులు జమైతే జీవితం మొత్తం జైల్లోనే గడిచిపోతుంది. ఆ గండం కట్టేక్కాలంటే మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి తీరాలి. గెలవాలి. దానికోసం దేన్నీ వదలదలుచుకోలేదు. ఎంతకైనా తెగించే ధోరణి ఆయన ఎన్నికల ప్రచార నిర్వహణ తీరులో ఉంది. మొన్న సిద్ధం సభ జరిపినా, ఇప్పుడు సీఎం జగన్ బస్ యాత్ర( జైత్రయాత్ర) చేస్తున్నా ఆయన కచ్చితంగా గెలిచి తీరాలన్నదే లక్ష్యంగా ఉంది. నమ్ముకున్న నరేంద్ర మోదీ నట్టేట ముంచుతాడని కలలో కూడా కనలేదు జగన్. చంద్రబాబుతో బీజేపీ ఎన్నికల దోస్తీ ఉంటుందని ఊహించను కూడా లేదేమో. మూడోసారి ప్రధాని కాబోతున్న మోదీతో చంద్రబాబు జతకడితే ఎటువంటి దుష్పరిణామాలు తటస్థయో జగన్ కు తెలుసు.రెండు ప్రధాన పార్టీల నేతలు తీవ్రమైన మానసిక ఆందోళనతో ఎన్నికల సమరంలో తలపడడం రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదని విశ్లేషకులు చెబుతున్నా గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలు తెగించారు. ఇద్దరూ జైలుకి వెళ్లివచ్చిన నేపథ్యంలో ఎవరి భయాలు వారికి ఉన్నాయి.ఈ తెగింపుతో ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో అనే భయం నెలకొంటుంది. రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్ర మరోసారి పునరుద్దానం చెందుతుందా అన్న అనుమానమూ లేకపోలేదు.

ఇప్పటికే వైఎస్ షర్మిల కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు పెంచుతోంది.జగన్ మీద ఆమె చేస్తున్న విమర్శలు ఆరోపణలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నేరుగా నువ్వు హంతకుడివి, హంతకులను కాపాడే వాడివి అని తన సోదరుడైన సీఎంనే నిందిస్తున్నారు ఆమె. మహిళగా ఆమె ప్రదర్శిస్తున్న ధైర్యం అసాధారణమే కావచ్చు గాని ఈ చర్య ఎలా ఉండబోతుంది, ఈ విమర్శల పర్యవసానమేమిటి, ప్రతిచర్య ఎలా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది అని తలుచుకుంటూనే గుండెలు గుభిల్లుమంటున్నాయి. ఆమె పోరాట శైలి కడప జిల్లా రాజకీయాలలో బలాబాలాలను వైయస్ కుటుంబం పంచుకునే పరిస్థితి ఏర్పడితే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని చెప్పవచ్చు. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి, షర్మిల మాతృమూర్తి విజయమ్మ తన మనుమడు ఉంటున్న అమెరికాకి వెళ్లి ఉండవచ్చు.

ఏది ఏమైనా ఈసారి ఎన్నికల వల్ల రాష్ట్రానికి ప్రమాదమే తప్ప ప్రమోదం కనిపించడం లేదు. జైలు భయంతో ఇద్దరు నేతలు చావో రేవో అనే రీతిలో తెగింపు చూపిస్తున్నారు. ఇది ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందోనని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకరు ఓడిపోతే మరొకరు కచ్చితంగా జైల్లోనే ఉంటారేమో అని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాహుల్ గాంధీ ప్రొఫెసర్ హరగోపాల్ తో అన్న మాటలు ఇక్కడ ప్రస్తావన అర్హం.

ఈ ఎన్నికల్లో మనం అంటే కాంగ్రెస్ గనక ఓడిపోతే మనందరం జైల్లోనే ఇక మాట్లాడుకోవాల్సి ఉంటుందేమో అని ఆయన అన్న కామెంట్ వీళ్ళిద్దరికీ కూడా వర్తిస్తుందేమో వీళ్ళల్లో ఏ ఒక్కరు ఓడిన మరొకరు ఇప్పటి కేసీఆర్ మాదిరిగా కష్టాలను ఎదుర్కోక తప్పదేమో.

రాష్ట్రంలోని ఈ పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇలా ఉంది..."ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రమాదపుటంచున ఉన్న మాట ముమ్మాటికీ నిజం. ప్రజల చైతన్యం మాత్రమే నేడు ఆంధ్రప్రదేశ్ కు రక్షణ కవచం. పాలక, ప్రతిపక్ష పార్టీల అధినేతలు రాజకీయంగా జీవన్మరణ పోరాటంగా ఎన్నికలను భావించి సర్వశక్తులు ఒడ్డుతున్న మాటా వాస్తవమే. జగన్, చంద్రబాబు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్, షర్మిల కూడా. ఎత్తుకు పైఎత్తులు అమలు చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు.

మోదీ ఒడ్డున కూర్చొని, రెండు గలాలు వేశారు. ఒక గాలానికి చిన్న చేప, రెండో గాలానికి పెద్ద చేప పడ్డా, రెండు తన బుట్టలోకే చెరతాయన్న నమ్మకంతో నిశ్చింతగా ఉన్నారు. అందుకనే పొత్తు చంద్రబాబుతో ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. మోదీ మూడోసారి పీఠమెక్కితే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమే" అంటున్నారు లక్ష్మీనారాయణ. దీనికి వైసీపీ నేతలు కూడా గట్టి కౌంటరే ఇస్తున్నారు. తమ నాయకుడు ఏ తప్పు చేయలేదని, ప్రజాబలం తమకే ఉందని, మోదీకో మరెవరికో భయపడాల్సిన పనేలేదన్నది వైసీపీ నేతల వాదనగా ఉంది. ఏదిఏమైనా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలందర్నీ ఆకర్షిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి కావడం విశేషం.

Tags:    

Similar News