మరో సారి తగ్గిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

ఎన్నికల్లో సీట్లు, తర్వాత మంత్రి పదవుల కేటాంపుల్లో తనను తాను తగ్గించుకున్న పవన్‌ కళ్యాణ్, తనకు పాలన అనుభవం లేదని, సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి మరో సారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Update: 2024-08-05 10:57 GMT

కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం ప్రశంసలు అందుకుంటోంది. ఎంతో రాజకీయ, పాలన అనుభవం కలిగిన నేతగా ప్రసంగించారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అధికార పక్షానికి సహకరించాలని, తమ ప్రజా ప్రతినిధులు చెప్పే పనులను చేయాలని అధికారులకు డైరెక్షన్లు ఇస్తారు. తమ తప్పులను చెప్పాలని, తమ ఎమ్మెల్యేలు ఇబ్బందులు కలిగిస్తే వాటిని తమ దృష్టికి తేవాలని, అలా చేస్తే వాటిని చక్కదిద్దుకుంటామని అధికారంలో ఉండే ఏ ప్రభుత్వం కూడా చెప్పదు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పాలి.

‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు’ పవన్‌ కళ్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఫేమస్‌ డైలాగ్‌. ఈ డైలాగ్‌ బాగా నచ్చిందేమో కానీ.. దీనిని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఫాలో అవుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌. ఆగస్టు 5న నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట్లాడుతూ తాను ఒక పార్టీకి అధినేతనని, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్న గర్వం కానీ, శాసన మండలిలో తమ పార్టీకి కూడా ప్రాతినిద్యం ఉందని, ఒక ఎమ్మెల్సీని కలిగి ఉన్న అహంభావం కానీ కనబరచ లేదు. తనకు పాలన రంగంలో అనుభవం లేదని సీఎం చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞులు, పని చేయడానికి, నేర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఇతర అధికారుల ముందు చెప్పి ఎక్కడ తాగ్గాలో అనేది మరో సారి నిరూపించుకున్నారు.
తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూ తన కంటే పరిపాలన దక్షత కలిగిన ఉన్న సహచర మంత్రివర్గం అంతా కలిసి రాజ్యాంగాన్ని కాపాడటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నామన్నారు. ఆయన అనుభవంతో తనను, మంత్రులను గైడ్‌ చేస్తారని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితీగా ఉండాలన్నారు. అలా ఉండని పక్షంలో కానీ, తమ మంత్రి వర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏమైనా తప్పులు చేస్తున్నట్లు, అకౌంటబులిటీకీ ఆటంకాలు కలిగిస్తున్నట్లు మీకు అనిపిస్తే అలాంటి సంఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని సరిదిద్దుకొని ప్రజలకు జవాబుదారి తనంగా మసలుకునేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్లు, ఇతర అధికారులను పవన్‌ కళ్యాణ్‌ కోరారు. అడ్మినిస్ట్రేటివ్‌ ప్రోసెస్‌లో తమ వల్ల మీకు ఒక అడుగు ముందుకు పడాలే కానీ వెనక్కు పడకూడదని, అలాంటి తప్పులు ఏమైనా ఉంటే తమకు చెప్పాలని వాటిని తాము కరెక్ట్‌ చేసుకుంటామని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మాటలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించడం గమనార్హం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పవన్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను తప్పు చేసినా శిక్షించాల్సిందేనని ప్రకటించి సంచనలం సృష్టించారు. అంతకు ముందు తాను గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం సమావేశంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగానే మారాయి. తాను ఇంటర్‌ వరకే చదువుకున్నానని, డిగ్రీ కానీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కానీ చదివి ఉంటే.. ఆ చదువు ఇప్పుడు ఉపయోగపడేదని, తన శాఖలపై సమీక్షలు చేస్తున్న సందర్భాల్లో చదువు, దాని ప్రాముఖ్యత తెలుస్తోందని మాట్లాడి, తన క్వాలిఫికేషన్‌ గురించి ఎలాంటి భేషజాలకు పోకుండా చెప్పుకోవడం విశేషం. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపుల్లో తక్కువ సీట్లతో సరిపెట్టుకున్నా, మంత్రి పదవుల విషయంలోను వెనక్కి తగ్గినా, పాలనలో తనకు అనుభవం లేదని చెప్పుకోవడంలో కానీ, సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకోవడంలో కానీ పవన్‌ కళ్యాణ్‌కే చెల్లిందనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News