ఇన్‌ఛార్జి సీఎంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

సీఎం చంద్రబాబు సింగపూర్‌ టూర్‌ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ కి ఇన్‌ఛార్జి సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం.;

Update: 2025-07-14 13:49 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఇన్‌ఛార్జి సీఎంగా బాధ్యతలు అప్పగించనున్నారు. సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ముగించుకుని వచ్చే వరకు నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించనున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. బాధ్యతలు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు కూడా సిద్ధమయ్యారు. ఇక అధికారిక ఉత్తర్వులు వెలువడటమే తరువాయి.. అన్న ప్రచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూటమి వర్గాలు, అధికార వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. మరో కొన్ని గంటల్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అమరావతి రెండో దశ భూసేకరణ చేపట్టాలనే నిర్ణయాన్ని పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకించారు. ఇలాంటి కీలకమైన అంశాలు తమతో ఎందుకు చర్చించలేదు..ఏక పక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు మీద పవన్‌కల్యాణ్‌ తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ రియాక్షన్‌కు ఒక్క సారిగా సీఎం చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. కూటమిగా కలిసున్నా.. ఇద్దరి మధ్య సఖ్యతలేదనే విషయం బయటకు పొక్కింది. దీంతో పాటుగా ఇది వరకు కూడా రాష్ట్రంలో శాంతి భదత్రలపైన బహిరంగంగానే పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పరస్థితుల్లో కూటమిలో విభేదాలు తలత్తెకూడదని సీఎం చంద్రబాబు భావించారని, పవన్‌ కల్యాణ్‌ను బుజ్జగించేందుకు తన సింగపూర్‌ పర్యటన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ఉన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కూటమి వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.
ఈ నెల 26న సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర అధికారులతో కలిసి సింగపూర్‌ టూర్‌ చేయనున్నారు. నాలుగు రోజుల పాటు సాగే సింగపూర్‌ పర్యటనలో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అక్కడ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వారికి వివరించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా తెలియజేయనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులను సాధించే దిశగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.
Tags:    

Similar News