సిట్ కాదు... సీబీఐకి ఇవ్వండి..

తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. సీబీఐ విచారణకు ఎందుకు వెళ్లడం లేదు. వైసీపీ, మిగతా పక్షాల డిమాండ్లు ఎందుకు పరిణలోకి తీసుకోవడం లేదు?

Update: 2024-09-23 10:12 GMT

తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వ్యవహారంపై ఐజీ ఆ పైస్థాయి అధికారి సారథ్యంలో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటించిన విషయం తెలిసిందే.


"తిరుమలలో అపచారం జరిగిందంటున్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించండి" అని వైసీపీ సహా కాంగ్రెస్, వామపక్షాలు చేసిన డిమాండ్లు కూడా పరిగణలోకి రాలేదు. సిట్ ఏర్పాటుతో ఒరిగే ప్రయోజనం ఏమిటి? వారికి స్వేచ్ఛగా విచారణ చేసే స్వాతంత్ర్యం ఉంటుందా? అనే విషయాన్ని కూడా తెరపైకి తీసుకువస్తున్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై ...
తిరుమల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)లో పోలీసు అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటారు. సీఎంను కాదని వారి దర్యాప్తు ముందుకు సాగుతుందా? విచారణలో పారదర్శకత ఉంటుందా? అనే ప్రశ్న కూడా తెరపైకి తీసుకువచ్చారు.

సెప్టెంబర్ 18 : "నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనె కూడా కలిసింది" అనే సంచలన విషయాలను సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఆరు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశమైంది. రాజకీయాలన్నీ తిరుపతి లడ్డు చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఎవరికి వారు.. ఏ పార్టీకి ఆ పార్టీ లబ్ధి పొందాలని దిశగానే స్వరాలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 19 : సీఎం ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. "ఆ ఆరోపణలు అబద్ధం. దీనిపై నా కుటుంబంతో సహా తిరుమలలో ప్రమాణం చేయడానికి సిద్ధం" అని ప్రకటించారు. " ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించండి" అని కూడా సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
తాజాగా సోమవారం కూడా ఆయన సుప్రీంకోర్టులో ఈ వివాదంపై ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీని ద్వారా "తన సారథ్యంలోని పాలకమండలి, మాజీ సీఎం వైఎస్. జగన్ సారథ్యంలో పనిచేసిన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం కూడా తప్పు చేయలేదు" అని చెప్తున్నారు.
సెప్టెంబర్ 22: ఇదే అంశంపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో కొవ్వులు కలిశాయన్న చంద్రబాబు వ్యాఖ్యలను " భక్తుల మనోభావాలతో ఆడుకునే రాక్షస క్రీడ ఇది" అని అభివర్ణించారు. " రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ వ్యవహారంపై సీబీఐ తో విచారణ జరిపించాలి. లేదంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి" అని డిమాండ్ చేశారు. "తప్పిదాలు, పాపాలకు పాల్పడి ఉంటే రక్తం కక్కుకొని చస్తారు" అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి శాపనార్థాలు విధించారు.

మనోభావాలతో ఆటలా


సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి నెల్లూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు. "తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. మీకు (సీఎం చంద్రబాబు) చిత్తశుద్ధి ఉంటే సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి" అని కాకాణి గోవర్ధనరెడ్డి కూడా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సవాల్లను పునరుద్ధాటించారు.
"సీఎం చంద్రబాబు పలుకులు టీటీడీ ఈవో శ్యామలరావు నోట కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో టీటీడీ ఈఓ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి" అని గోవర్ధన్ రెడ్డి సూచించారు.
సిట్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణకు ఐజీ లేదా అంతకన్నా ఉన్నత స్థాయి అధికారి సారథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీస్ అధికారులు "లడ్డూ వ్యవహారానికి సంబంధించి టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, సరఫరాదారుల వివరాలు, ల్యాబ్ టెస్ట్ నివేదికలు పరిశీలిస్తున్నారు. అయితే, వారికి ఇవ్వబోయే టాస్క్ ఏంటి? ఏ సంవత్సరంలో, టీటీడీ పాలకమండలి.. ఎవరి సారథ్యంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా జరిగిందనే వివరాలు కూడా పరిశీలిస్తారా? మొదటినుంచి అంటే..
1)  2004 సంవత్సరం నుంచి ప్రామాణికంగా తీసుకుంటారా? లేదా..
 2) 2019 లో అధికారం చేపట్టిన వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారాలపైనే దృష్టి సారిస్తారా?
3)  2014- 19 కాలంలో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో కూడా టీటీడీకి అందిన నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు లేవనే కారణంతో 14 ట్యాంకర్లను తిరస్కరించారు. ఆ వ్యవహారాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఈ విషయాలపై అనేక సందేహాలు ఉన్నాయి.
టీటీడీ ఈఓ శ్యామలరావుకు మాదిరే... కచ్చితమైన టాస్క్‌తోనే సిట్‌ను ఏర్పాటు చేస్తారా? అనేది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నియమించే సిట్ సారథి, వారికి ఇచ్చే టాస్క్ పైనే దర్యాప్తు కమిటీ నిబద్ధత ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
దేశంలోనేకాదు. ప్రపంచంలో శ్రీవారి భక్తులు అశేషంగా ఉన్నారు. వారి మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని సీబీఐ విచారణకు ఎందుకు వెళ్లడం లేదనేది ప్రధాన ప్రశ్న.
సీబీఐ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే, వారికి అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అయితే, పారదర్శకత కోసం అన్ని పక్షాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో "పరిపాలనలో పారదర్శకంగా వ్యవహరిస్తాం" అని చెప్పుకనే సీఎం చంద్రబాబు అలా ఎందుకు వ్యవహరించడం లేదనేది అర్థం కాని ప్రశ్నే.

మరో విషయం ఏమిటి అంటే..
టీటీడీకి మొదటి నుంచి సరఫరా అవుతున్న నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలు లేవని పలు ప్రభుత్వాల కాలంలో నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపిన తిరస్కరించిన దాఖలాలు కోకొల్లలు. ఇది నిత్య కృత్యంగా ఉంటుందనేది ఈ వ్యవహారాలను దగ్గరగా గమనించే సీనియర్ జర్నలిస్టు ఒకరు చేసిన వ్యాఖ్య.
2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో కూడా అంటే జూన్ 16వ తేదీ నుంచి రెండు నెలలు ట్యాంకర్లను తిరస్కరించారు. అని ఆ జర్నలిస్టు గుర్తు చేశారు.
నెయ్యి పరీక్ష ఎలా జరుగుతుందంటే..?
టీటీడీకి దశాబ్దాల కాలం నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. అందులో ప్రతి ట్యాంకర్ నుంచి రెండు లీటర్ల నెయ్యి శాంపిల్స్ తీస్తారు.. ఆ నెయ్యి నాణ్యత తెలుసుకోవడం కోసం శాంపిళ్లను మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత... నెయ్యి ట్యాంకర్‌ను తిరుమలకు పంపుతారు. మార్గమధ్యంలో మళ్లీ ఏమైనా కలిపారా? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి తిరుమలలోని ల్యాబ్లో మరోసారి నెయ్యి నాణ్యతను పరీక్షిస్తారు. శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి నాణ్యతపై ఇంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ, సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డు ప్రసాదం రాజకీయాలకు వేదికగా మారింది.

డైవర్షన్ పాలిటిక్స్...

ఈ వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు.
"తన పాలనకు భంగం కలుగుతోంది అని భావించినప్పుడు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. అది ఆయనకు సహజసిద్ధమైన అలవాటు" అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. "తన 100 రోజుల పరిపాలనలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. తనకు వస్తున్న చెడ్డ పేరు నుంచి ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టించడానికి మాత్రమే తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తీసుకువచ్చారు" అని రోజా వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత నెయ్యి వాసన, రుచి చూశారు. చక్కగా ఉందన్నారు. రెండు నెలల క్రితం రెండు ట్యాంకర్లను నాణ్యత లోపించింది అంటూ తిప్పి పంపించారు. ఆ సమయంలో ఆ నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పిన ఈవో ఇప్పుడు మాట మార్చడం ఎందుకు? ఆ నివేదికను రెండు నెలల తర్వాత బయట పెట్టాల్సిన అవసరం ఏమిటి? అని రోజా సూటిగా ప్రశ్నించారు.
తిరుమల లడ్డు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలతో పాటు మాజీ సీఎం వైఎస్. జగన్ కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ విశ్రాంత ఈవో, ఉమ్మడి రాష్ట్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు కూడా "సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను నేను నమ్మడం లేదు. విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలి" అని డిమాండ్ చేశారు. లేదు అంటే హిందూ సమాజానికి సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి" అని కూడా డిమాండ్ చేయడం గమనార్హం.
ఇదిలావుంటే...
2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అంతకుముందు ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో తిరుమల అదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ. సుబ్బారెడ్డి, ప్రధానంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలోని పాలక మండలి కాలంలో కూడా శ్రీవాణి ట్రస్ట్, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని, వాటిని నిగ్గు తేల్చాలని టీడీపీ కూటమి ప్రభుత్వం 72 మంది రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపింది. మూడు దశల్లో అన్ని రికార్డులు పేజీపేజీ పరిశీలించారు. 52 మంది ఇంజినీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై తిరుగుబాటు ప్రారంభం అవుతుందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో సైలెంట్ అయ్యారు. ఇంతవరకు ఆ దర్యాప్తు నివేదిక ఏమైంది అన్నది కూడా ప్రభుత్వం వెల్లడించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో లడ్డూ వ్యవహారంపై ఏర్పాటు చేయనున్న సిట్ వల్ల ఏమి తేలుస్తారనడం కంటే వారికి ఎలాంటి టాస్క్ ఇస్తారనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. వారు ఏమి నిగ్గు తేలుస్తారనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News