‘నన్నూ చంపేస్తారేమో’.. సునీత రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హంతకులకు అధికారం ఇవ్వొద్దని వైఎస్ సునీత రెడ్డి కోరారు. అవినాష్ రెడ్డిని ఓడించడమే ఆశయమని వెల్లడించారు. తనను చంపినా ఆశ్యర్చపడనక్కర్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-06 10:38 GMT

హంతకులు అధికారంలో ఉంటే ఏ ఒక్కరికీ న్యాయం జరగదని, అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదని వైఎస్ సునీత రెడ్డి.. ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘నాన్నను హత్య చేసిన వాళ్లు బయట రాజాలా తిరుగుతున్నారు. అయినా ఈ వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి’’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేయించిన వాళ్లు అధికారంలో ఉండటం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని, చదువు, తెలివి, స్తోమత అన్నీ ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో తాను ఉన్నానని వివరించారామే. ‘‘అందుకే ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని పాలించే వాళ్లు హంతకులు కావాలా, అభివృద్ధి చేసే వాళ్లు కావాలా. అది ఆలోచించిన తర్వాతే ఓటు వేయండి’’అని ఓటర్లను ఉద్దేశించి అన్నారు సునీత రెడ్డి. రానున్న ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలవకుండా చేయడమే తన లక్ష్యమని, రాజకీయం కోసం తాను పోరాటం చేయట్లేదని, తన పోరాటం అంతా న్యాయం కోసమేనని వెల్లడించారు.

న్యాయ పోరాటం ఇంత కష్టమా!

‘‘వివేకా హత్య జరిగి ఐదేళ్లు పూర్తయినా ఈ కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలు మొద్దు నిద్రలోనే ఉన్నాయి. హంతకులకు అధికార పీఠం అండగా నిలుస్తుంది. నా తండ్రి చావుకు న్యాయం జరగాలని ఐదేళ్లుగా అలుపెరగక న్యాయ పోరాటం చేస్తున్నా. డబ్బు, తెలివి, చదువు అన్నీ ఉన్నా హంతకులు అధికారంలో ఉంటే న్యాయపోరాటం చేయడం ఇంత కష్టమా. అడుగడుగా అడ్డంకే తగులుతుంది. హంతకులు పదవుల్లో ఉన్నంత కాలం ఇలానే ఉంటుంది. అందుకే హంతకులకు అధికారం రాకూడదని ఈ పోరాటం ప్రారంభించా. రాజకీయంపైన ఆసక్తి లేదు. అదే ఉండి ఉంటే ఏదో ఒక పార్టీ జెండా పట్టుకుని పదవి కోసం పాకులాడేదానిని. కానీ నాకు కావాల్సింది న్యాయం. ఇప్పుడు బయటకు వెళ్లిన తర్వాత నన్ను కూడా నరికి చంపిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు’’ అని ఆమె స్ఫష్టం చేశారు.

షర్మిలను అందుకే పక్కన బెట్టారు

కాంగ్రెస్ నుంచి జగన్, విజయమ్మ బయటకు వచ్చేసిన తర్వాత 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేశారు. ఆ తర్వాత అప్పటికే పదవుల విషయంలో కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉన్నా అన్న కొడుకు జగన్ వెంటే ఉండాలని వివేకానంద రెడ్డి.. మంత్రి పదవి ఇస్తానన్న కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికి జగన్ వెంటన నడిచారు అని సునీత రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఆ తర్వాత సీబీఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. అప్పుడు పార్టీ బరువు బాధ్యతలను షర్మిల తన భుజాన వేసుకుని ముందుకు సాగారు. జగన్‌ వెంట ఉండటానికి అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు అంతా తానై షర్మిల ప్రచారం చేసి ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. అప్పుడు ఆంధ్రలో షర్మిలకు ఆదరణ పెరుగుతోంది. అది చూసి కడుపుమండి ఆమెను పక్కన పెట్టేశారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి షర్మిల బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని బరిలోకి దింపారు. ఆ నిర్ణయాన్ని వివేకానందరెడ్డి వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తన ఓటమి వెనక అవినాష్ కుటుంబం వెన్నుపోటు దాగి ఉందని స్పష్టమైంది. ఆ తర్వాత 2019 మార్చి 15న నా తండ్రి హత్యకు గురయ్యారు. దీని వెనక కుటుంబీకుల హస్తమే ఉందని నేను కూడా మొదట నమ్మలేదు. అందుకే నా కుటుంబీకులను పూర్తిగా నమ్మాను. కానీ నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదేనని ఆలస్యంగా గుర్తించా. మళ్లీ ఆ తప్పు చేయను. హంతకులను కటకటాల వెనక్కు పంపేవరకు న్యాయం పోరాటం చేస్తాం’’ అని ఆమె వెల్లడించారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.



Tags:    

Similar News