ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా
తనపై అసత్య ఆరోపణలతో వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెకీతో విద్యుత్ ఒప్పందం విశయమైన ఇష్టాను సారం తమపై ఆరోపణలు చేశారని, కేవలం ఇవి రాజకీయ ఆరోపణలుగానే తాము భావిస్తున్నామని, కావాలనే కక్ష గట్టి వారు రాశారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలుగుదేశం పత్రికలని, ఆ పార్టీని ఎల్లో గ్యాంగును నెత్తిన పెట్టుకొని మోస్తున్నాయని విమర్శించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఇష్టం వచ్చినట్లు రాసిన రాతలపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు. గతంలో టీవీ రూ. 50వేలు ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ. 25వేలకు తగ్గిందని, అలాగే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు కూడా తగ్గాలి కానీ ఎందుకు పెరిగాయని తెలిసే కావాలనే ఇలాంటి రాతలు రాశారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనుగోళ్లు చేశారా? వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఎక్కువ రేట్లకు కొనుగోళ్లు చేశారా? అనేది చూడాలన్నారు. గుజరాత్‌లో రూ. 1.99లకు విద్యుత్ కొనుగోలు చేస్తుంటే.. ఏపీలో రూ. 2.49లకు కొనుగోలు చేశారని రాసేటప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు అప్లై అవుతున్నాయా? లేవా? గుజరాత్ కొనుగోలు చేసిన విద్యుత్ ఆ రాష్ట్రానికి సంబంధించిందా? వేరే రాష్ట్రాలదా? అనే అంశాలను తెలుసుకోకుండా బురద జల్లే కార్యక్రమాన్ని మొదలు పెట్టి కావాలనే ఇలాంటి నీచపు రాతలు రాయడం దుర్మార్గమన్నారు. గుజరాత్, రాజస్థాన్‌లో సోలార్ పవర్ ఎక్కువుగా ఉత్పత్తి అవుతుందని, అందుకు అక్కడ ఎడారి ప్రాంతాలు ఉండటమే కారణమన్నారు. ఏపీలో తక్కువ ఉష్ణోగ్రత ఉండటం, అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అక్కడ సాధ్యం అవుతుందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా కావాలని, బ్లేమ్ చేసేందుకు ఇలాంటి రాతలు రాసినందు వల్ల వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలని చెప్పారు.