‘అవకాశం కల్పించండి’.. సీఎస్‌కు దశథరామిరెడ్డి లేఖ

రాయలసీమలో రాష్ట్ర విభజన చట్టంలోని రాయలసీమ హామీలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. విభజన పూర్తయ్యి పది సంవత్సరాలు పూర్తవుతున్నా రాయలసీమ హామీలను అమలు చేయడంలో..

Update: 2024-06-01 10:22 GMT

రాయలసీమలో రాష్ట్ర విభజన చట్టంలోని రాయలసీమ హామీలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. విభజన పూర్తయ్యి పది సంవత్సరాలు పూర్తవుతున్నా రాయలసీమ హామీలను అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే రాయలసీమ ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హామీలను అమలు చేయడం కాదు.. కనీసం వాటిని పలకాడనికి కూడా పాలకులు ఇష్టపడటం లేదంటూ మండిపడుతున్నాయి. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు-రాయలసీమ అభివృద్ధి అంశాలపై నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో మేధోమధనం జరిగింది. ఈ సందర్భంగా పాలకుల తీరుపై రాయలసీమ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగానే "రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలను" నూతన ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి మెయిల్ ద్వారా సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి శనివారం లేఖ పంపారు.

 

అక్టోబర్ 4, 2023 న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ వలన రాయలసీమ సాగునీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిసినా కూడా ఈ అంశాలకు తమకు సంబంధమే లేనట్లుగా పాలకులు, ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించడాన్ని సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాయలసీమ హక్కులు, ఆశలు, ఆకాంక్షల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోన్న ప్రభుత్వ వైఖరిపై రాయలసీమ సమాజం ఆందోళనలో ఉందని, నూతనంగా కొలువు తీరే ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాయలసీమ ప్రజా సంఘాలు ఆకాంక్షిస్తున్నాయని వెల్లడించారు. ఈ విషయాన్ని నూతనంగా ఏర్పడే ప్రభుత్వం దృష్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకెళ్లాలని బొజ్జా దశరథరామిరెడ్డి తన లేఖలో కోరారు.

జూన్ 10, 2024 న నంద్యాల జిల్లా సంగమేశ్వరంలో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8 వ వార్షికోత్సవంలో రాయలసీమ ప్రజాసంఘాలతో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో రాయలసీమ సమగ్రాభివృద్దిపై రూపొందే నివేదికను మీకు, నూతనంగా ఏర్ఫడే ప్రభుత్వంలోని ముఖ్యమంత్రికి స్వయంగా అందచేయడానికి, చర్చించడానికి తమరు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News