వైసీపీ నిర్లక్ష్యం వల్లే.. పంటలకు నష్టం
గత వైసీపీ ప్రభుత్వం నీటివనరులను నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. తుపాను వల్ల జరిగిన పంట నష్టాన్ని ఆమె పరిశీలించారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-10-23 11:24 GMT
సాగునీటి వనరులను గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలేదు. అందుకే పొలాలు.. చెరువులుగా మారాయి. అని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల కారణంగా తెగిన బండమీదపల్లి చెరువును ఆమె పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్లే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాలు పంటలు నీట మునగడానికి కారణమైందని ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదిత రైతులను ఆమె పరామర్శించారు. పంట నష్టం వివరాలు, చెరువులు, కాలువల మరమ్మతులకు ఆ శాఖల మంత్రులు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. సీఎం ఎన్. చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకుని వెళ్లి, త్వరగా పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటానని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు.
జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు తెగిపోయింది. దీంతో పంటలు నీటమునిగాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి బుధవారం చెరువును పరిశీలించారు. చెరువు కింద ముంపునకు గురైన వరి, చీనీ పంటలు, కోతకు గురైన పంటపొలాలను పరిశీలించారు. బాధిత రైతుల కష్టాలు విన్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి చెరువుకు మరమ్మతులు చేయలేదని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం చెరువుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సునీత ఆదేశించారు. పంటనష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రులతో మాట్లాడా..
అనుకోకుండా భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయి. నీటి ప్రవాహం ముందుకు కదలక పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చింది అని ఎమ్మెల్యే అన్నారు. చెరువులు, కాలువల స్థితిగతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందుకే నీటి ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడి చెరువులు, కాలువలు తెగిపోయాయని సునీత అన్నారు. కనగానపల్లి, బండమీదపల్లి చెరువులకు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. దీని వలన వేలాది ఎకరాల్లో రూ. కోట్ల పంటను రైతులు కోల్పోయారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన్ని ఒకసారి జిల్లాకు వచ్చి పంటలను పరిశీలించాలని కోరినట్లు వివరించారు. మంత్రి అచ్చన్నాయుడు కూడా దీనిపట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు. చెరువులు, కాలువలు తెగిపోయిన అంశాన్ని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి నివేదిక తెప్పించుకున్నారన్నారు. వాటి మరమ్మతులకు నిధులు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మొత్తం పంట నష్టం పై నివేదికను అధికారులు సిద్ధం చేశారని ఈ వివరాలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్తామని సునీత హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని రైతులను ఊరడించారు. చెరువులకు, కాలువలకు శాశ్వత మరమ్మతులు చేయిస్తానని కూడా ఆమె రైతులకు భరోసా ఇచ్చారు.