ఏపీలో ఆక్వా రైతుల క్రాప్ హాలిడే

రొయ్యల రైతులు ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ క్రాప్ హాలిడే ప్రకటించారు. జూలై నుంచి మూడు నెలల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ఇవ్వనున్నారు.;

Update: 2025-04-08 03:11 GMT
రస్తారోకో చేస్తున్న ఆక్వా రైతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై భారీగా పడటంతో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నర్సాపురం, అచెంట నియోజకవర్గాల ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు క్రాప్ హాలిడే తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ సోమవారం పాలకొల్లు వై జంక్షన్ వద్ద భారీ రస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో రైతులతో పాటు ఫీడ్ కంపెనీలు, వ్యాపారులు కూడా పాల్గొని, ప్రభుత్వాల నిర్లక్ష్య తీరును ఎండగట్టారు.

పాలకొల్లు వద్ద రస్తారోకో

సోమవారం ఉదయం పాలకొల్లు వై జంక్షన్ వద్ద వందలాది రైతులు భారీ సంఖ్యలో చేరారు. రోడ్డుపై బైఠాయించి, ట్రాఫిక్‌ను అడ్డుకున్న రైతులు "రైతులను ఆదుకోండి", "ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోండి" వంటి నినాదాలతో ఆందోళన చేశారు. ఈ రస్తారోకో కారణంగా ఆ ప్రాంతంలో గంటల తరబడి రాకపోకలు స్తంభించాయి. ఆక్వా రైతు సంఘం నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ నెలాఖరు నాటికి పంటను ముగించుకోవాలని రైతులకు పిలుపు నిచ్చారు. స్థానిక పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, రైతులు తమ గళాన్ని వినిపించేందుకు గట్టిగా నిలబడ్డారు.


జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రస్తారోకో సందర్భంగా బహిరంగ సభ జరిగింది. సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ప్రతిపాదించిన క్రాప్ హాలిడే తీర్మానాన్ని రైతులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వందల మంది రైతులు సభలో పాల్గొని ప్రభుత్వాల తీరును, ట్రంప్ వ్యవహార శైలిని తప్పు పట్టారు. ప్రస్తుతం మూడు నియోజకవర్గాల రైతులు క్రాప్ హాలిడేకు నిర్ణయం తీసుకున్నారని, మిగిలిన నియోజకవర్గాల రైతులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సభలో ప్రకటించారు. ప్రాసెసింగ్ ప్లాంట్స్ కు అండగా నిలిచేందుకు విడతల వారీగా పోరాటాలు చేపట్టాలని సభలో తీర్మానించారు. ఆక్వా రంగంలోని వివిధ పరిశ్రమల యజమానులతో కమిటీ వేసి, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేాశారు. 

ఆగిన రొయ్యల కొనుగోళ్లు

ట్రంప్ సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత, అమెరికాకు రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో రొయ్యల ధరలు కిలోకు రూ. 40 వరకు పడిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, ఏటా 3.5 లక్షల టన్నుల రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. అయితే సుంకాల పెంపుతో ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, దాణా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పతనం రైతులను ఆర్థికంగా కుంగదీసింది. చాలా మంది రైతులు అప్పులు ఇచ్చే వారు లేక సాగును తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


ఫీడ్ కంపెనీల బాధలు

ఆక్వా రైతుల సంక్షోభం ఫీడ్ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. రొయ్యల సాగు తగ్గడంతో ఫీడ్ డిమాండ్ గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో 50కి పైగా ఫీడ్ మిల్స్‌లు ఉండగా, వీటిలో చాలా వరకు ఉత్పత్తిని తగ్గించాయి. పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఫీడ్ కంపెనీలు రైతులకు అప్పుగా ఇచ్చిన దాణా ధరలు తిరిగి రాకపోవడంతో వారు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ సంక్షోభం వల్ల వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది.

వ్యాపారుల ఇబ్బందులు

సుంకాల ప్రభావం వ్యాపారులను కూడా వెంటాడుతోంది. రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వ్యాపారులు తమ స్టాక్‌ను విక్రయించలేక గిడ్డంగుల్లో నిల్వ చేయడానికి కూడా స్థలం లేని దుస్థితి ఏర్పడింది. అమెరికా మార్కెట్‌లో గిరాకీ తగ్గడంతో, ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్డర్లు కూడా రద్దు అవుతున్నాయి. దీనికి తోడు స్థానిక వ్యాపారులు రొయ్యల ధరలను అన్ని కౌంట్‌లలో తగ్గించడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో వ్యాపారులు, రైతుల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి వ్యాపారులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తోంది.

ప్రభుత్వాల తీరుపై విమర్శలు

రైతులు ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలో కేంద్రం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు లేనందున రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్రం, రాష్ట్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతు సంఘం డిమాండ్ చేసింది.

మొత్తంగా ట్రంప్ సుంకాలు ఆక్వా రైతుల జీవనోపాధిని దెబ్బతీసిన నేపథ్యంలో క్రాప్ హాలిడే, రస్తారోకోల ద్వారా తమ గోడును వినిపించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంక్షోభం రైతులతో పాటు ఫీడ్ కంపెనీలు, వ్యాపారులను కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడంతో, తక్షణ పరిష్కారం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News