‘కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ అనుకూలమైనది’

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.;

By :  Admin
Update: 2025-02-02 06:40 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై మధ్యతరగతి హర్షం వక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు, కొందరు మేధావుల నుంచి మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ బడ్జెట్‌పై సీపీఐ(ఎంఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు పీ ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎటువంటి కొత్త అంశం లేదని, ఎప్పటి తరహాలోనే కార్పొరేట్‌కు అనుకూలంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వారు అధికారిక ప్రకటన ఒకటి చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రధానంగా రైతు, కార్మిక, కూలీ, శ్రామిక వర్గాల వ్యతిరేకమైనదని, ఇది విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు అంకితం చేసిన బడ్జెట్‌గా చెప్పొచ్చు అని అన్నారు.

‘‘వాస్తవ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే సంక్షేమరంగ కేటాయింపులకు పది నుండి పదిహేను శాతం సబ్సిడీలని పెంచాలి. అలా పెంచకపోగా కరెన్సీ రూపంలో కొన్నింటికి కోత పెట్టింది. ఉదాహరణకు ఆహార సబ్సిడీ రూ. 2.05 లక్షల కోట్లకు కనీసం పది శాతం పెంచితే నిరుటి వాస్తవ కేటాయింపుకి సమానం అవుతుంది. కానీ ₹2.03 లక్షల కోట్లకు తగ్గించింది. ఎరువుల సబ్సిడీని రూ. 1.64 లక్షల కోట్ల నుండి 1.67కి సర్దుబాటు చేసి నికర కోత పెట్టింది. ఇందన సబ్సిడీని నికర కోత పెట్టింది. ఈ మూడు రంగాలు అశేష శ్రామిక జనజీవితాలతో ముడి పడినవే. గ్రామీణాభివృద్ధి కోసం సబ్సిడీ కేటాయింపు రూ.2.65 లక్షల కోట్లను కరెన్సీ రూపంలో దాదాపు యధావిధిగా రూ.2.66 లక్షల కోట్ల వద్దే ఉంచింది. అంటే నికర ద్రవ్యోల్బణం ప్రకారం పది శాతం పైనే కోత పెట్టింది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు రూ. 1.51 లక్షల కోట్ల నుండి 1.71 లక్షల కోట్లకు పెంచినా, ఆ పేరిట ఆ అనుబంధ రంగాల్లో కార్పొరేట్లకి సబ్సిడీగా మారుతుంది. ఇవన్నీ ప్రధానంగా దేశ రైతాంగానికి తీవ్ర హాని కలిగించే విధానాలే.

లేబర్ కోడ్లు అమలు చేయొద్దన్న కార్మిక సంఘాల విజ్ఞప్తులకు అవకాశం ఇవ్వలేదు. ఉపాధి అవకాశాలు లేవు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవకాశం చూపించలేదు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చర్యలు లేవు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్ల క్రమబద్దీకరణ చర్యలు లేవు. కోటి మందికి పైగా స్కీం ఉద్యోగ, శ్రామిక వర్గానికి ఉపశమనం లేదు. ఆదివాసీ ప్రజల సమస్యలపై చర్యలు లేవు. ఇంకా వివిధ బాధిత వర్గాల ప్రజల సమస్యలపై స్పందన లేదు.

మధ్యతరగతి ప్రజలకి ఆదాయం పన్ను రాయితీ రూపంలో ఉపశమన చర్య చేపట్టింది. అది ఉద్యోగుల్లో తక్కువ శాతం మందికి వర్తించేది. అది ఏటా ఏడు లక్షల పైగా ఆదాయం గడించే వారి వరకు కల్పించింది. ఆ సౌకర్యం నెలకు రూ.60 వేలు లోపు జీతం పొందే వారికి వర్తించదు. ఇది ఇటీవల క్రమంగా బీజేపీ మధ్యతరగతి ప్రజల్లో కోల్పోతున్న రాజకీయ పట్టు, ఢిల్లీ ఎన్నికల్లో అవసరం కల్సి మధ్యతరగతిలో ఈ కొద్ది శాతం మందికి ఈ వల విసిరింది. ఇది షుగర్ కోటింగ్ విషగుళికను మధ్యతరగతి ప్రజలతో మింగించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.

ఆంధ్రప్రదేశ్ పై రాజకీయ మనుగడ ఆధారపడి వున్న మోడీ ప్రభుత్వం ఏ.పి.కి మొండిచేయి చూపింది. గత హామీల ఊసు లేదు. ఇప్పుడు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేదు. కానీ బీహార్ కి మాత్రం వరాల జల్లు కురిపించింది. ఇది మోడీ ప్రభుత్వంతో చంద్రబాబు కూటమి ప్రభుత్వ ముందస్తు కుమ్మక్కును సూచిస్తున్నది. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర, రాష్ట్ర సర్కార్ల ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విదేశీ, స్వదేశీ కార్పొరేట్ అనుకూల మరియు సర్వ శ్రామిక ప్రజలకు వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకించాలని అన్ని వర్గాల ప్రజలకు మా సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది’’ అని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News