ఎంఎల్ఏ హత్యకు కుట్ర ?

ఎంఎల్ఏను హత్యచేయటమే టార్గెట్ గా శేలిరింగంపల్లి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధి తన మద్దతుదారులతో వచ్చారా ?

Update: 2024-09-12 08:09 GMT

బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందా ? ఎంఎల్ఏను హత్యచేయటమే టార్గెట్ గా శేలిరింగంపల్లి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధి తన మద్దతుదారులతో వచ్చారా ? అంటే అవుననే ఆరోపిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. రెండు రోజులుగా ఇద్దరు ఎంఎల్ఏల మధ్య మాటల మంటలు రేగుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ గాంధీని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా నియమించటమే. పీఏసీ ఛైర్మన్ పదవిని మామూలుగా అయితే ప్రధాన ప్రతిపక్షంలోని ఎంఎల్ఏకు కేటాయిస్తారు. అదికూడా ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరిపేరు సూచిస్తే వారిని స్పీకర్ ఛైర్మన్ గా నియమిస్తారు.



 పీఏసీ ఛైర్మన్ పదవికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాజీమంత్రి, గజ్వేలు ఎంఎల్ఏ హరీష్ రావు పేరును సూచించారు. ఇపుడు జరిగింది ఏమిటంటే కేసీఆర్ సూచించినట్లు కాకుండా స్పీకర్ తనిష్టం వచ్చినట్లుగా గాంధీని ఛైర్మన్ గా నియమించారు. వెంటనే గాంధీ బాధ్యతలు కూడా తీసేసుకున్నారు. దాంతో బీఆర్ఎస్ వాళ్ళకి మండిపోయింది. అయితే సీనియర్లు కాకుండా పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపారు. దాంతో పాడి రెచ్చిపోయి బుధవారం మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ పిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేయకపోతే చీరలు కట్టుకుని గాజులు వేసుకోవాలని ఎద్దేవాచేశారు. పనిలోపనిగా గాంధీని కూడా పాడి మాటలతో ఎటాక్ చేశారు.

ఎందుకు ఎటాక్ చేశారంటే గాంధి పీఏసీ ఛైర్మన్ గా నియమితులుకాగానే తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే స్పీకర్ ఛైర్మన్ గా తనను నియమించారని అన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధికోసం రేవంత్ రెడ్డిని కలిశాను కాని కాంగ్రెస్ లో చేరలేదని చెప్పారు. దాంతో బీఆర్ఎస్ నేతలకు బాగా మండిపోయింది. అందుకు పాడి మాట్లాడుతు గురువారం ఉదయం తాను గాంధీ ఇంటికి వస్తానని ఎంఎల్ఏ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరేద్దామని చెప్పారు. జెండా ఎగరేసిన తర్వాత తనతో కలిసి గాంధి కేసీఆర్ దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు. దానికి గాంధీ స్పందించి పాడి లాంటి బ్రోకర్ చెప్పిన మాటలు వినాల్సిన అవసరంలేదని, దమ్ముంటే తనింటికి ఎంఎల్ఏ రావాలని ఒకవేళ రాకపోతే ఉదయం 11 తర్వాత తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళతానని గాంధి చాలెంజ్ చేశారు.



 దాంతో ఇద్దరి మధ్యా చాలాసేపు మాటల యుద్ధం జరిగింది. గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి బయలుదేరిన పాడిని పోలీసులు హౌస్ అరెస్టుచేశారు. పాడిని ఇంటినుండి బయటకు కదలటానికి పోలీసులు అనుమతించలేదు. దాంతో 11 గంటల తర్వాత గాంధీని నేరుగా పాడి ఇంటికి చేరుకున్నారు. గాంధీని పోలీసులు అడ్డుకున్నా తన మద్దతుదారులతో గాంధీ తోసుకుని పాడి ఇంటిముందు బైఠాయించారు. దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలని పాడిని గాంధీ పదేపదే చాలెంజ్ చేశారు. దాంతో పాడి ఇంటిదగ్గర బాగా టెన్షన్ పెరిగిపోయింది. గాంధీ మద్దతుదారులు కోడిగుడ్లు, రాళ్ళు, టమోటాలతో దాడిచేశారు. పాడి ఇంట్లోకి చొచ్చుకుపోయినపుడు కౌశిక్ రెడ్డి మద్దతుదారులు ప్రతిఘటించటంతో పెద్ద రబసజరిగింది.



 పాడి ఇంటిముందు దాదాపు రెండుగంటలపాటు తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఇరువైపు మద్దతుదారులను కంట్రోల్ చేయటానికి పోలీసులు నానా అవస్తలు పడాల్సొచ్చింది. చివరకు పోలీసులు ఎంఎల్ఏ గాంధీని అదుపులోకి తీసుకుని మద్దతుదారులతో పాటు పాడి ఇంటినుండి దూరంగా తీసుకుపోయారు. తర్వాత పాడి మాట్లాడుతు తనను హత్యచేసే కుట్రతోనే ఫిరాయింపు ఎంఎల్ఏ గాంధీ మద్దతుదారులతో తనింటిమీదకు వచ్చినట్లు ఆరోపించారు. తనతో మాట్లాడే ఉద్దేశ్యంలో ఉండేట్లయితే కోడిగుడ్లు, రాళ్ళు, టమోమాలు, కర్రలు, కత్తులను ఎందుకు తీసుకొచ్చారంటు మండిపడ్డారు. తనింటి ముందున్న కుర్చీలతో తన మద్దతుదారులను గాంధీ అనుచరులు కొట్టినట్లు చెప్పారు.

ఇంత రబస అవసరమా ?

నిజానికి ఇంత రబస అవసరమే లేదు. ఎందుకంటే ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పాడి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో కేసు వేశారు. వీళ్ళ పిటీషన్ను విచారించిన కోర్టు నాలుగు వారాల్లోగా ఫిరాయింపులపై ఏదో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. కాబట్టి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు నాలుగువారాల పాటు ఓపికపట్టాలి. అయితే అలా చేయకుండా కోర్టు ఆదేశాలను పట్టుకుని పదేపదే ఫిరాయింపు ఎంఎల్ఏలను పాడి అసహ్యంగా మాట్లాడారు. చీరలు, గాజులు పంపిస్తానని మీడియా సమావేశంలో చీరలు, గాజులు చూపించారు. పనిలోపనిగా గాంధీని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో గాంధీ బూతులతో పాడిపై రెచ్చిపోయారు. దాని ఫలితమే గురువారం ఉదయం నుండి తీవ్ర ఉద్రిక్తపరిస్ధితులు.

Tags:    

Similar News