విజయవాడలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కార్యాలయంపైకి కోడిగుడ్లతో దాడులు చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులు.;
By : The Federal
Update: 2025-04-30 11:36 GMT
విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, నినాదాలు, ప్రతినినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గాం ఉగ్ర దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ మీద, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆమె మీద మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వైఫల్యం వల్లే పహల్గాం దాడులు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైకి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అదే రాజధాని ప్రాంత పర్యటనకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఉదయం ప్రయత్నించారు. 2015లో ప్రధాని మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంకు వెళ్లాలని షర్మిల భావించారు. అయితే ప్రధాని మోదీ పర్యటన్ నేపథ్యంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు చేరుకున్న ఆమె అక్కడ నుంచి ఉద్దండరాయునిపాలెంకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా పార్టీ కార్యాలయంలోనే షర్మిల భైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. షర్మిలకు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతి నినాదాలు చేశారు. బీజేపీ శ్రేణులు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి దూసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగని వారు కోడి గుడ్లతో దాడులకు పాల్పడ్డారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల శ్రేణుల నినాదాలు, ప్రతినినాదాలతో పీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు పార్టీల శ్రేణులను నిలువరించేందుకు చర్యలు తీసుకున్నారు. పీసీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు దూసుకొని పోయిన బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పహల్గాం ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మూడు రోజుల క్రితం షర్మిల ఆధ్వర్యంలో దాడుల్లో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ విజయవాడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడి మన దేశం మీద జరిగిన దాడి. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే కారణం. బీజేపీ ఈ విషయాన్ని తప్పు దారి పట్టిస్తోంది. ఒక మతం మీద జరిగిన దాడిగా క్రియేట్ చేస్తోంది. దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఇదే పనిలో ఉంది. ఇది చాలా బాధాకరం. చనిపోయిన వాళ్లలో ముస్లింలు కూడా ఉన్నారు. ఇది మతం మీద జరిగిన దాడి కాదు. భారతదేశం మీద జరిగిన దాడి. బీజేపీ సోషల్ మీడియా.. మతం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తోంది. ఇది బాధాకరమైన విషయం. దేశంలో మళ్ళీ ఇలాంటి తీవ్రవాద ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అంటూ వైఎస్ షర్మిల మాట్లాడారు.