విశాఖ ఉక్కును చంపేస్తుంటే బాబు, పవన్ నోరు మెదపరేం?

విశాఖ స్టీల్ కార్మికులకు సంఘీభావంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల బుధవారం (మే 21) నుంచి నిరాహార దీక్ష కు దిగారు;

Update: 2025-05-21 11:53 GMT
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించాలనే డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల
విశాఖ స్టీల్ ప్లాంట్‌ (విశాఖ ఉక్కు)ను క్రమంగా చంపేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోరు తెరవకపోవడం విచిత్రంగా ఉందని మండిపడ్డారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైలెంట్ గా విశాఖ ఉక్కును చింపేసేందుకు కుట్ర చేస్తోందని, లక్షల కుటుంబాలకు జీవనాధారమైన ఈ ప్లాంట్‌ను అదానీ వంటి కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కుట్ర సాగుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్న ఆందోళనకు ఆమె మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. విశాఖ స్టీల్ కార్మికులకు సంఘీభావంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల బుధవారం (మే 21) నుంచి నిరాహార దీక్ష కు దిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఈ ప్లాంట్ లాభాల్లో నడిచిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “కుక్కను చంపాలంటే పిచ్చిదిగా చూపించాలి” అన్న సామెతలా వ్యవహరిస్తోందని, ప్లాంట్‌ను అర్థహీనంగా చూపించేందుకు రకరకాల కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఆక్రమణల రూపంలో కుట్రలు
ప్లాంట్‌కు కావలసిన ముడి సరుకును కావాలనే కేటాయించడం లేదన్నారు. ఎగుమతుల ధరలు పెంచి స్టీల్ ప్లాంట్‌పై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. గతంలో ఒక మైన్‌ను ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మైన్‌ను ఇవ్వకుండా కుట్ర పన్నడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇదంతా ప్లాంట్‌ను వ్యర్థంగా చూపించి ప్రైవేటీకరణకు బలిపశువు చేయడమే లక్ష్యమని ఆరోపించారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవడమే...
కేంద్రం స్టీల్ ప్లాంట్‌కు ₹11,000 కోట్ల సహాయం చేశామని చెప్పడం అబద్ధమని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. అందులో ₹8,000 కోట్లు బ్యాంకు రుణాలుగా తిరిగి తీసుకున్నారని, మరికొన్ని వేల కోట్లు ఇవ్వాలంటే ఉద్యోగులను తొలగించాలి అనే నిబంధనలు పెట్టారని, దానిలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే 2,000 మంది కార్మికులను తొలగించగా, మరో 3,000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఒకప్పుడు 34,000 మంది పని చేసిన ఉక్కు సంస్ధలో ఇప్పుడు సగం మంది కూడా లేరన్నారు.
చంద్రబాబు – పవన్ కల్యాణ్ మౌనంపై ఆగ్రహం..
రాష్ట్రంలోని – టీడీపీ, జనసేన – కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉదాశీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఇది న్యాయమా? మోదికి ఊడిగం చేస్తున్నారా?” అంటూ ఆమె వారిపై తీవ్ర విమర్శలు చేశారు.
“ఉద్యోగుల్ని తీసేస్తుంటే మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? బీజేపీ కుట్రలకు మౌనంగా ఎందుకు నిలిచారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉక్కు ఫ్యాక్టరీపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు...
“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాన్ని అమ్మేందుకు చేసిన కుట్రల్లో మీరు భాగమయ్యారా?” అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పటికైనా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 2,000 మందిని తిరిగి తీసుకునే వరకు ఉద్యమం ఆగదు అని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేశారు. ప్లాంట్ అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ముమ్మరం చేస్తామన్నారు వైఎస్ షర్మిల.
Tags:    

Similar News