మేల్కోకపోతే రేవంత్ కు ఇబ్బందులేనా ?

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు రేవంత్ రెడ్డికి ఇబ్బందులు కలిగించేదే అనటంలో సందేహంలేదు;

Update: 2025-02-02 11:05 GMT

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు రేవంత్ రెడ్డికి ఇబ్బందులు కలిగించేదే అనటంలో సందేహంలేదు. వెంటనే మేల్కొనకపోతే ఎంఎల్సీ ఎన్నికల్లో ఇబ్బందులు పడటం ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శనివారం నగరంలోని ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎంఎల్ఏలు రహస్యంగా భేటీ(Congress MLAS Meeting) విషయం బయటపడింది. ఈ సమావేశానికి జడ్చర్ల ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి సారధ్యంవహించారు. అనిరుధ్ ఎంపికచేసిన పదిమంది ఎంఎల్ఏలను కేవలం భోజనానికి మాత్రమే ఆహ్వానించారు. భోజనానికి పిలిచిన తర్వాత కేవలం భోజనంమాత్రమే చేసి ఎంఎల్ఏలు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోరన్న విషయం అందరికీతెలిసిందే. భోజనంచేస్తున్నప్పుడే తమనియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అభివృద్ధిపనులకు నిధుల మంజూరు, సంక్షేమపథకాల అమలుతీరు, మంత్రుల వైఖరి, బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎంఎల్ఏలకు ఇస్తున్న ప్రాధాన్యత లాంటి అనేక అంశాలు ఎలాగూ చర్చకు వస్తాయి.

ఈవిషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అనిరుధ్ చాలాతెలివిగా భోజనం మీటింగ్ అనిమాత్రమే పదిమంది ఎంఎల్ఏను ఆహ్వానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రహస్యభేటీ జరిగిందా లేదా అనే విషయమై భిన్నవాదనలు వినబడుతున్నాయి. పార్టీఏమో ఎంఎల్ఏల రహస్యభేటీ జరగలేదని అంటున్నది. కాని హన్నకొండ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి మాత్రం భేటీ జరిగిందని పరోక్షంగా ధృవీకరించారు. భోజనానికి రమ్మని అనిరుధ్ నుండి తనకు ఆహ్వానం అందినమాట వాస్తవమే అన్నారు. అయితే తాను భోజనంమీటింగుకు వెళ్ళలేదని కూడా చెప్పారు. నాయిని ప్రకటన ప్రకారం భోజనంమీటింగు జరిగింది వాస్తవమే అన్నవిషయం అర్ధమైపోతోంది. అయితే మీటింగుకు హాజరైన ఎంఎల్ఏలు ఎవరనే విషయంలో మాత్రం క్లారిటి రావటంలేదు.

అసలు ఈవిషయం ఎందుకింత రచ్చగా తయారైందంటే బీఆర్ఎస్(BRS) వల్లే. కాంగ్రెస్ ఎంఎల్ఏలు భోజనంమీటింగులో కలవగానే పార్టీలో రేవంత్(Revanth) పై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ నేతలు ట్విట్లర్లో కామెంట్లు పెట్టారు. భోజనంమీటింగు ఏర్పాటుచేసిన అనిరుధ్ ఉద్దేశ్యంఏమిటి ? హాజరైన ఎంఎల్ఏల ఆలోచనలు ఏమిటో ఎవరికీ తెలీదు. కానీ మీటింగ్ జరగ్గానే రేవంత్ పై ఎంఎల్ఏల తిరుగుబాటు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా(Social media)లో హోరెత్తించేసింది. అధికారపార్టీలో అయోమయం సృష్టించటమే టార్గెట్ గా పెట్టుకున్న కారుపార్టీ నేతలు ఈవిషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మీటింగ్ విషయం బయటపడగానే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) వెంటనే అనిరుధ్ కు ఫోన్లో మాట్లాడి వారిని సముదాయించినట్లు సమాచారం. తాజాగా అనిరుధ్ మాట్లాడుతు భోజనంమీటింగ్ జరిగింది వాస్తవమే అన్నారు. వివరాలను తర్వాత చెబుతానని చెప్పారు.

రేవంత్ కు కష్టమేనా ?

ఈనెల 27వ తేదీన ఎంఎల్సీ ఎన్నికలు జరుగుతుండగా ఇపుడు ఎంఎల్ఏలు ప్రత్యేకంగా భేటీ అవటం రేవంత్ కు ఏమాత్రం మంచిదికాదు. ఇప్పటికే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల 10 నియోజకవర్గాల్లో పార్టీలో తలనొప్పులు పెరిగిపోతున్నాయి. పదినియోజకవర్గాల్లో పార్టీ సీనియర్ నేతలకు, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలకు చాలాచోట్ల పడటంలేదు. జగిత్యాల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో జరగుతున్న పరిణామాలే ఉదాహరణలు. ఫిరాయింపు ఎంఎల్ఏలకు సీనియర్ నేతలకు మధ్య తలెత్తిన వివాదాల సర్దుబాటుపై రేవంత్ దృష్టిపెట్టకపోతే రాబోయే ఎంఎల్సీ ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లోనూ నష్టంజరగటం గ్యారెంటీ.

ఫిరాయింపుల పదినియోజకవర్గాలతో పాటు భోజనంమీటింగుకు హజరైన పదిమంది ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో కూడా పార్టీకి నష్టంజరిగే అవకాశాలు ఎక్కువగాఉన్నది. 20నియోజకవర్గాల్లో పార్టీకి నష్టంజరిగే అవకాశాలుండటం చిన్నవిషయంకాదు. కాబట్టి రేవంత్ వెంటనే మేల్కొని పరిస్ధితిని చక్కదిద్దకపోతే తర్వాత జరిగిన నష్టాన్నితలచుకుని ఉపయోగంలేదు.

Tags:    

Similar News