కిటకిటలాడుతున్న ఓటింగ్‌ కేంద్రాలు

80శాతం పైన ఓట్లు పోలయ్యే అవకాశాలు ఏపీలో కనిపిస్తున్నాయి. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరి ఎండను కూడా లెక్కచేయకుండా కనిపిస్తున్నారు.

Update: 2024-05-13 10:05 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లతో పోలింగ్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో ఆలస్యంగా ఓట్లు నమోదు కావడం, అధికారులు సరైన సౌకర్యాలు కలుగజేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. నిండు వేసవి కావడంతో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉక్కపెడుతోందని ఓటర్లు తెలిపారు. కనీసం మంచినీళ్లు కూడా కొన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదు.

సాయంత్రం మూడు గంటల సమయానికి సుమారు 50 శాతం పోలింగ్‌ జరిగింది. ఓటర్లు ఓట్లు వేసేందుకు వచ్చిన ఉత్సాహంగా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రముఖులంతా ఎక్కడికక్కడ ఉదయం ఓట్లు వేశారు. చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ విఫలమైందని, పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
తెనాలిలో ఓటు వేసేందుకు లైన్లో రాకుండా వేరుగా వెళుతున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్‌ను ప్రశ్నించిన ఒక ఓటరుపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. దాంతో తిరిగి ఓటరు కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరును చితకబాదారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి కారు అద్దాలను వైఎస్సార్‌సీపీ వారు పగులగొట్టారు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటాలలో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పల్నాడు జిల్లాలో కొన్నిచోట్ల రీపోలింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు కెనడీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో తాగేందుకు మంచినీళ్లు కూడా లేవని ఓటర్లు తెలిపారు. ఈ స్కూల్లో పలు పోలింగ్‌ స్టేషన్లలో ఓటు వేసేందుకు వచ్చిన వారు సుమారు నాలుగు గంటల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.
పిఠాపురంలో వంగా గీత ఓటు వేసేందుకు లైన్లో కాకుండా వేరుగా వెళుతుండటంతో ఓటర్లు నిలదీశారు. దీంతో ఆమె లైన్లోనే ఉండి ఓటు వేశారు. మార్కాపురం, శ్రీకాకుళం, కాకినాడ, బాపట్ల, మధురవాడ ప్రాంతాల్లో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. గుంటూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి కిలారి రోశయ్యను ఓటర్లు అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు కారుపై కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేసి అద్దాలు పగుల గొట్టారు.
Tags:    

Similar News