టీడీపీలో ప్రజా ప్రతినిధుల నియంత్రణకు కమిటీ
తెలుగుదేశం పార్టీలో తప్పులు చేస్తున్న ప్రజా ప్రతినిధులను నియంత్రించే కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-10-20 10:11 GMT
ఇటీవల తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, ప్రజా ప్రతినిధులు ఏ తప్పులైతే చేశారో అవే తప్పులు టీడీపీలోని ప్రజా ప్రతినిధులు కూడా చేస్తున్నారని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ, శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మత్రుల సమావేశంలోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినైతే తప్పులు చేస్తున్నారని వేలెత్తి చూపించి ప్రజలు చీకొట్టేలా చేశామో అవే తప్పులు ఇప్పుడు మనవారు చేస్తుంటే ఏమి చేయాలి? మీరే చెప్పండి అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ వారు మద్యం, ఇసుకను దోచుకొని కోట్లు కొల్లగొట్టారని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోసింది. ఎక్సైజ్ శాఖ ఎండీగా పనిచేసిన రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. మద్యం అమ్మకాల్లో కుంభకోణం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇసుకకు సంబంధించి మైన్స్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డిని అవినీతి ఆరోపణలపై విచారించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇసుక అమ్మకాల్లో కోట్లు కొల్లగొట్టారని వైఎస్సార్‌సీపీ వారిపై ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఇందులో చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పుడేమి జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను ఇష్టానుసారం అమ్ముకున్నారు. ఇష్టం వచ్చిన వారికి ఇచ్చేశారు. లెక్కలు ఉన్నా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన ఇసుక ప్రస్తుతం రాష్ట్రంలో లేకుండా పోయింది. వేసవి కాలంలో ఇసుకను క్వారీల నుంచి బయటకు తీసి నిల్వ ఉంచి వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా భవన నిర్మాణాలకు ప్రభుత్వం విక్రయించేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఎన్నికల నాటికి సుమారు 70 లక్షల టన్నుల ఇసుకను డంపింగ్ కేంద్రాల్లో నిల్వ ఉంచింది. మే, జూన్ ఎన్నికల హడావుడి కావడంతో అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఇసుక వ్యవహారం పట్టించుకోలేదు. దీంతో ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక నెల రోజుల పాటు సీఎం, మంత్రుల బాధ్యతల స్వీకరణలు, అధికారుల మార్పులు, చేర్పుల్లో ప్రభుత్వం పడిపోయింది. ఇసుక విషయం అందరూ మరిచిపోయారు.
అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకు డంపింగ్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఎమ్మెల్యేల ద్వారా వారి అనుచరులు కావాల్సిన వారికి కావాల్సినంత అమ్మారు. దీంతో కొన్ని ఇసుక డంపింగ్ యార్డుల్లో ఇసుక లేకుండా పోయింది. ఉదాహరణకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం బోడిరెడ్డిపల్లె జంక్షన్ వద్ద నిల్వ ఉంచిన డంపింగ్ యార్డ్‌లోని ఇసుక కొత్త ప్రభుత్వం వచ్చి నెల తిరక్క ముందే పూర్తిగా అమ్మేశారు. ఇందులో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ హస్తం ఉందని బేల్దార్ కూలీలు, ఇతర కార్మికులు, మేస్త్రిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కడుతున్న భవనాలు ఇసుక లేక ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పనులు ఆగిపోవడంతో బేల్దార్‌లు, కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భవన నిర్మాణ కార్మిక యూనియన్ కింద సుమారు 600 మంది సభ్యులు ఉన్నారు. సభత్యం తీసుకోని వారు మరో వెయ్యి మంది వరకు ఉంటారని కార్మిక సంఘం వారు చెబుతున్నారు. వీరందరికీ పనిలేకుండా పోవడానికి ప్రభుత్వ చర్యలే కారణమనే విమర్శలు వస్తున్నాయి.
ఇవన్నీ ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విషయంలో నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం నదుల్లో నుంచి ఇసుక తోడాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సన్నటి ఇసుక అసలు రావడం లేదు. గుండు ఇసుక గోడ కట్టేందుకు పనికొస్తుందే కాని గ్లాబ్ చేసేందుకు పనికి రావడం లేదని బేల్దార్‌లు చెబుతున్నారు. పైగా నదుల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు ఉన్నందున ఇసుకను బయటకు తీయడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇక నెలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇసుక ఇబ్బందులు తప్పవని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 16 నుంచి ఎటువంటి కొరత లేకుండా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చినా అది సాధ్యం కావడం లేదు.
ఇక రెండో అంశం మద్యం దుకాణాలు. మద్యం దుకాణాలు తమ వారికి దక్కించుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారు. ముందుగానే దుకాణాలకు దరఖాస్తులు వారి మనుషుల ద్వారా చేయించారు. ప్లాన్ ప్రకారం ఎక్కువ మంది చేత దరఖాస్తులు చేయించి ఎవరికి షాపు వచ్చినా టీముగా ఉన్నవారంతా కలిసి చేసుకునే విధంగా నిర్ణయించారు. ఇప్పటికే మద్యం వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. మద్యం వ్యాపారంలో వేలు పెట్టిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎంత మందనే వివరాలు ఇంటిలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం తెప్పించారు. వారందరికీ పరోక్ష హెచ్చరిక చేశారు. ఈ విధంగా చేస్తూ పోతే మీపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనల్ని నమ్ముకుని ఓట్లు వేసిన ప్రజలకు నేను ఏమని సమాధానం చెప్పాలి. మీ పద్దతి మారటం లేదని సీఎం తీవ్రమైన హెచ్చరికలు చేశారు.
ఇటువంటి వ్యవహారాలు నిరోధించేందుకు ఐదుగురు సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కమిటీని ప్రకటించలేదు. కమిటీలో ఎవరెవరిని ఉంచాలనే విషయంలోనూ కొందరు ముఖ్యులతో చంద్రబాబునాయుడు చర్చించారు. అందరికీ ఆమోద యోగ్యమైన మచ్చలేని వారిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేయనున్నారు. ఎవరైనా తప్పులు చేసినట్లు ప్రభుత్వ వేగుల ద్వారా సమాచారం వస్తే వారిని పిలిపించి మాట్లాడి మరో సారి తప్పు చేయకుండా వారి నుంచి హామీ తీసుకుని పంపిస్తారు. రెండో సారి ఆ ప్రజా ప్రతినిధి తప్పు చేస్తే ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఈ కమిటీ తీసుకుపోతుంది. అక్కడ సీఎం వారికి ఏ విధమైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలో ఇచ్చి పంపిస్తారు. ఆయన మాట కూడా వినకుంటే వెంటనే పార్టీ క్రమశిక్షణ కమిటీకి వీరి పేర్లు పంపించి కఠినమైన చర్యలు తీసుకుంటారు. పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉన్నా పార్టీలో జరిగే తప్పులను సరిదిద్దేందుకు క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుంది. ఫైవ్ మెన్ కమిటీ అలా కాకుండా ప్రజా ప్రతినిధులు చేస్తున్న తప్పులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్స్ చేసే విధంగా ఏర్పాటవుతోంది.