‘చంద్రబాబు నన్ను బచ్చా అంటాడా?’

చంద్రాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు వెన్నపోట్లూ, మోసాలు తప్ప మరేమీ రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-20 14:58 GMT

(శివరామ్)

పొత్తుల కోసం వెంపర్లాడుతున్న సీనియర్ సీఎం చంద్రబాబు తనను బచ్చా అనడం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్ర చూస్తే.. పోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు హీరోలు బచ్చాలుగానే కనిపిస్తుంటారని కౌంటర్ ఇచ్చారు. ‘‘బచ్చా అయిన నేను ఒంటరిగా ఎన్నికల బరిలోకి వస్తుంటే, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నీవు పొత్తులతో ఎందుకు వస్తున్నావు’’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ఉమ్మడి విశాఖ జిల్లా గొబ్బూరులో శనివారం జరిగిన మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. "వీరంతా రాష్ట్రాన్ని దోచుకోడానికి, దాచుకోవడానికి చూస్తున్నారు. ఈ విధంగా పొత్తులతో అంతా కలిసి కట్టుగా వచ్చి, బాణాలు పట్టుకుని నా చుట్టూ ఉన్నారు.

ఇంత మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అవినీతి రహిత పాలనకు అందరూ మద్దతు పలకాలి. అనేక సంక్షేమ పథకాలతో రూ.2.70 లక్షల కోట్లను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు అందజేశాం. వీటిలో ఎక్కడైనా అవినీతికి తావుందా? ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? గతంలో ఎన్నడూలేని విధంగా నా అక్కాచెల్లెమ్మలను పట్టించుకున్న ఇలాంటి ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడైనా ఇటువంటి పథకాలు చూశారా?’’ అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలోనూ కొత్తగా ఏడు వ్యవస్థలు తీసుకొచ్చామని జగన్ చెప్పుకొచ్చారు. చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చింది వాళ్ల మేనమామ జగన్మోహనరెడ్డి అని విద్యార్థులు గర్వంగా చెప్పుకొంటున్నారన్నారు.

ప్రతి కుటుంబం మారాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైద్యాన్ని ఇంటి గడపకు తీసుకొచ్చింది మన ప్రభుత్వమే అని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ఆరోగ్య శ్రీలో సేవలను పెంచి, దానికయ్యే వ్యయాన్ని రూ. 25 లక్షల వరకు పెంచిన విషయాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు. మీ కుళ్లు మెదడుకు ఇలాంటి ఆలోచనలు ఏనాడైనా వచ్చాయా? అని కూటమి ప్రతినిధులను ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడూ వెన్నుపోట్లూ, మోసాలు, కుట్రలు చేయడమే తెలుసన్నారు. ప్రజలకు మేలు చేసే బాధ్యత బాబుకు ఎప్పుడూ లేదన్నారు. ఈ ఎన్నికలు పేదల భవిషత్తు మార్చనున్నాయన్నారు. ‘‘మరలా వైసీపీ ప్రభుత్వం వస్తేనే పథకాలు అన్నీ కొనసాగుతాయి. లేకపోతే అన్నింటికీ స్వస్తి పలకడమే. మోసపూరిత వాగ్దానాలు చూసి ఓటేస్తారా? మంచి చేసిన అంశాలను చూసి ఓటేస్తారా?’’ అని జనాలను ప్రశ్నించారు జగన్.

Tags:    

Similar News