సీఎం చంద్రబాబుకు హామీల భయం!
ఎన్నికల హామీల విషయంలో ముఖ్యంత్రి ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు.;
Byline : G.P Venkateswarlu
Update: 2025-02-27 08:14 GMT
కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భయం పట్టుకుంది. మొదటి సారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ హామీలన్నీ అమలు చేయాలంటే భయమేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ప్రధానంగా ప్రభావం చూపాయి. ఈ హామీల్లో ఇప్పటి వరకు కేవలం ఒక్క హామీ మాత్రమే అమలు చేశారు. అది కూడా పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. ఇంకా గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అవేవీ అమలు కాలేదు.
1. ఏడాదికి ఆర్థికంగా వెనుకబడిన ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలెండర్‌లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం నిదానంగా అమలు జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 93 లక్షల మందికి ఇచ్చారు. ఇంక ఎంత మంది అర్హులనేది అధికారులు కూడా చెప్పటం లేదు. వినియోగ దారుని ఫోన్‌కు మెసేజ్ వస్తుందని, ఆ మెసేజ్ ప్రకారం అర్హుల జాబితా రూపొందిస్తారని చెబుతున్నారు. అంటే నిజమైన అర్హులు ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది.
అమలు కావాల్సిన పథకాలు
2. నిరుద్యోగ యువతలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం. లేదంటే వారికి నెలనెల రూ. 3వేలు ఆర్థిక సాయం అందించాలి.
ఈ పథకంపై నిరుద్యోగులు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగం రాని వారు తమకు ఖర్చుల కోసం నిరుద్యోగ భృతి ఉపయోగ పడుతుందనుకున్నారు. కానీ ఈ పథకం గురించిన ఆలోచనలు ఇంతరకు నేతల మెదళ్లలోకి రాలేదు. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు స్కిల్ ఉన్న వారి వివరాలు సేకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి నియోజకవర్గంలో స్కిల్ సర్వే జరిగింది. అలాగే రాష్ట్రమంతా సర్వే చేయాలని నిర్ణయించారు. కానీ అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో, దానిపై ఏమని నేతలు భావిస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
3. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు పథకం
ఈ పథకానికి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరు పెట్టింది. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ. 15వేల వంతున ఇవ్వాలి. నిజానికి ఎన్నికలు కాగానే జూన్ లోనే పథకాన్ని అమలు చేయాలి. గత ఏడాది పథకం అమలు కాలేదు. ఈ సంవత్సరం మేలో పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇవ్వటం లేదని, ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిని ప్రభుత్వం ఖండించలేదు. దీనిపై సందిగ్ధం వీడాల్సి ఉంది.
4. ప్రతి రైతుకూ ఏటా రూ. 20వేలు ఆర్థిక సాయం.
పథకం గత ఏడాది నుంచి అమలు కావాల్సి ఉంది. కాలేదు. ఈ సంవత్సరమైనా అమలు జరుగుతుందేమో అని రైతులు ఎదురు చూశారు. ఈనెల 24న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే సాయాన్ని అందించింది. ఆ సమయంలో రాష్ట్రం కూడా అనుకున్న ప్రకారం సాయం అందిస్తుందేమోనని ఎదురు చూశారు. అయితే అమలు కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కెవివి ప్రసాద్ కోరారు.
5. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500లు సాయం.
18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500లు వంతున ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల్లో కూటమి నాయకులు హామీ ఇచ్చారు. తరువాత ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. గతంలో బీసీ, ఈబీసీ మహిళలకు ఏడాదికి రూ. 15,000లు వంతున ప్రభుత్వం సాయం అందించింది. నెలకు రూ. 15 వందల పథకం ఎంత మందికి ఇస్తారు. అర్హులు ఎవరు. అనే విషయం ఇంకా తెలియదు. ప్రభుత్వం కూడా దీనిపై ఇంతవరకు మాట్లాడలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా సీపీఐ కార్యదర్శి వనజ అన్నారు.
6. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం.
ఏపీలోని మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణం కల్పించే పథకానికి ఎప్పుడు శ్రీకారం చుడతారా? అని మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారులు, మంత్రుల బృందాలు వెళ్లి పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. ఆ నివేదికలు ఏమయ్యాయనే విషయం చెప్పటం లేదు. ఈ ఏడాది ఉగాది నుంచి పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికి మూడు సార్లు చెప్పి వాయిదా వేశారు. ఇప్పుడైనా ఈ పథకం అమలు జరుగుతుందా? లేదా? అనే సందేహాలు మహిళల్లో ఉన్నాయి. ఆర్టీసీ నడవాలంటే ప్రభుత్వం వారికి సకాలంలో నిధులు ఇవ్వాలి. ఉచితంగా ప్రయాణం చేసిన మహిళలకు ఎంత ఖర్చు అయిందో అంత మొత్తం నిధులు ఆర్టీసీకి విడుదల చేయాల్సి ఉంటుంది.
హామీల అమలు పై మాట్లాడని పవన్ కల్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో మాత్రం ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఆ తరువాత కాలం గడిచే కొద్ది ఆ విషయం మరిచిపోయారు. మంత్రి లోకేష్ మాత్రం అప్పుడప్పుడు తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని తప్పకుండా అమలు చేస్తామని చెబుతున్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో కేవలం సిలెండర్ల పథకం మాత్రమే అమలు చేసి మిగిలిన ఏపథకం కూడా అమలు చేయకపోవడం రాష్ట్రంలో ^è ర్చనియాంశమైంది. నిరుద్యోగులు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. గ్రూప్–2 పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఇటీవల ఆందోళనలకు దిగారు.