అమరావతికి రండి.. పెట్టుబడిదారులకు చంద్రబాబు పిలుపు..

అమరావతికి పెట్టుబుడులు తీసుకురావడంపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. పక్క రాష్ట్రాల్లోని పెట్టుబడి దారులను అమరావతికి ఆహ్వానిస్తున్నారు.

Update: 2024-06-27 09:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం దూకుడుగా ప్రవర్తిస్తోంది. అన్ని రంగాల్లో దూకుడు నిర్ణయాలతో అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, సంపద సృష్టిస్తామని చంద్రబాబు పదేపదే చెప్పారు. అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి సంపద సృష్టించే దిశగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా పరుగులు పెట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం అమరావతికి తీసుకురావాల్సిన పెట్టుబడులపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

పెట్టుబడి దారులకు పిలుపు

అమరావతికి దేశ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కర్ణాటక వ్యాపారస్తులకు ఆయన పిలుపునిచ్చారు. సెంచురీ గ్రూప్ సంస్థల ఈడీ అశ్వినిపై, ఎండీ రవీంద్రపై సహా తదితరులు చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగానే అమరావతిలో పెట్టబడులు పెట్టడానికి వారిని ఆహ్వానించారు చంద్రబాబు. అందుకు అశ్వినిపై సానుకూలంగా స్పందించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా అమరావతిలో పెట్టుబడులపై తాము ఒక నిర్ణయానికి వస్తామని చంద్రబాబు వివరించారు.

ఇతర రాష్ట్ర వ్యాపారస్తులకు స్వాగతం

కేవలం కర్ణాటక వ్యాపారస్తులే కాకుండా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులకు కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. పెట్టుబడి దారులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందించే రాయితీలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ఆహ్వానంపై పలు రాష్ట్రాల్లోని దిగ్గజ వ్యాపారస్తులు ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వ వర్గాలతో చర్చించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పెట్టబడులు ఖరారు అయిన వెంటనే వాటిని ప్రకటించాలని కూడా చంద్రబాబు సదరు అధికారులకు, శాఖలకు చెప్పారని ప్రచారం జరుగుతోంది.

ఏ అవకాశం వృథా కాదు

పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ ఒక్క అవకాశం లభించినా వృథా కానివ్వొద్దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించాలని చెప్పారు. ఆ దిశగానే మంత్రి కూడా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందుకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు కూడా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక క్యాపిటల్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక్క తప్పటడుగు చాలు!

అయితే వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమ రావడం కాదు కదా ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయి. దాంతో రాష్ట్ర అభివృద్ధిలో భారీ కుంటు పడింది. ఆ నష్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదేళ్లలో పూడ్చడం, దాంతో పాటుగా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు తీసుకురావడం, కొండల్లా పేరుకుపోయిన రాష్ట్ర అప్పులను తరిగించడం, రాష్ట్ర అప్పులు ప్రజలకు భారంగా మారకుండా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి మరెన్నో అతిపెద్ద సవాళ్లను బాబు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని, వీటిలో ఎక్కడైనా ఒక్క తప్పటడుగు వేసినా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం పొందడంపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News