సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
మంత్రి ఆనం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం దంపతులకు సాదరంగా స్వాగతం పలికారు.;
By : The Federal
Update: 2025-04-11 16:01 GMT
అత్యంత వైభవంగా నిర్వహించే ఒంటిమిట్ట కోదండస్వామి ఆలయం సీతారాముల కళ్యాణ్ మహోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి సతీసమేతంగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒంటిమిట్ట వేడుకకు హాజరయ్యారు. అంతకుముందు సీతారాముల కళ్యాణ ఉత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి తిరుమల బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, ఒంటిమిట్ట కోదండస్వామి ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం సీఎం చంద్రబాబుకు ఆలయ పండితులు నెత్తి మీద తలపాగా చుట్టారు. తర్వాత ప్రభుత్వం తరపున సీతారాముల వారికి సమర్పించే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాటిని స్వామి వార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి అక్షింతలు చల్లారు. స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీతారాములతో పాటు లక్ష్మణుడితో కూడిన ప్రత్యేక చిత్ర పటాన్ని సీఎం దంపతులకు వేదపండితులు బహూకరించారు. అనంతరం సీఎం దంపతులు స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వేడుకను తిలకించారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం బయలుదేరి ఉండవల్లి నివాసానికి రానున్నారు.