ఖర్జూరం ఓ వ్యక్తి ప్రాణం తీసింది

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Update: 2025-12-07 04:26 GMT

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతారు. కానీ అలాంటి డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఖర్చూరం రూపంలో మృత్యువు వెంటాడింది. ఆరోగ్యం సంగతి అటుంచితే ఏకంగా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఖర్జూరం పండు విత్తనం గొంతులో ఇరుక్కుని, అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోవడం వల్ల ఊపిరాడక పెనుకొండ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందిన హృదయ విదారక ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. సకాలంలో వైద్యం అందించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో ఆ వ్యక్తి మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

విషాదకర ఘటన వివరాలు

శ్రీ సత్యాసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) అనే వ్యక్తి గతంలో ఫ్లెక్సీల వ్యాపారం చేసి, ప్రస్తుతం కార్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గంగాధర్ గత కొంతకాలం నుంచి గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంట్లో ఖర్జూర పండ్లు తింటుండగా, అనుకోకుండా ఖర్జూరం విత్తనం ఒకటి గొంతులోకి జారిపోయి అక్కడ ఇరుక్కుపోయింది. అంతేకాకుండా ఆ విత్తనం కాస్తా నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లిపోవడంతో అప్పటి వరకు సంతోషంగా గడిపిన గంగాధర్ ఒక్కసారిగా ఊపిరి ఆడక అల్లాడిపోయారు. 

ఫలించని చికిత్స ప్రయత్నాలు

దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే గంగాధర్‌ను చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి అత్యంత సీరియస్‌గా ఉందని చెప్పి, మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు గంగాధర్ ను హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు సైతం పరిస్థితిని సమీక్షించి, విత్తనాన్ని తొలగించేందుకు పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం గంగాధర్‌ను జిల్లా కేంద్రమైన అనంతపురానికి తరలిస్తుండగా, ఊపిరి ఆడక మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ దురదృష్టకర సంఘటన పెనుకొండ పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆహారం గొంతులో ఇరుక్కున్నప్పుడు చేయవలసిన ప్రాథమిక చికిత్స (హీమ్లిచ్ మ్యాన్యువర్) గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండటం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News