టీడీపీ నేతలకు చంద్రబాబు తీపికబురు
పదిరోజుల్లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని గడువు నిర్దేశించిన పార్టీ అధినేత;
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగుదేశం నాయకులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చల్లటి కబురు అందించారు. ఖాళీగా వున్న నామినేటెడ్ పోస్టుల భర్తీని పది రోజుల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ఛైర్‌పర్సన్లు, సభ్యుల పోస్టులను భర్తీ చేయాల్సివుంది. వాటికోసం ఇప్పటికే అన్ని జిల్లాలలో నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. కాగా అభ్యర్థుల ఎంపికను ఈ నెల 15లోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గడువు నిర్దేశించారు.ఇప్పటికే ఈ పదవుల కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతిపాదించిన పేర్లను పార్టీ కార్యాలయంలో జల్లెడపడుతున్నారు.రాష్ట్రంలో 900 దేవాలయాలకు ఛైర్మన్లు, కమిటీ సభ్యుల్ని నియమించాలి. మార్కెట్ కమిటీల్లోనూ చాలావరకు భర్తీచేయాలి. రాష్ట్రంలోని 2028 పీఏసీఎస్‌లకు గాను ఇటీవలే 491 సొసైటీలకు ఛైర్మన్, ఇద్దరు సభ్యులతో కమిటీలను నియమించారు. మిగతా వాటికి త్వరలోనే కమిటీలు వేయనున్నారు.