‘జీతాలు పెంచాలి’.. చంద్రబాబుకు అంగన్వాడీల డిమాండ్స్

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు సర్కార్ చొరవ తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బవరమ్మ డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలని కోరారు.

Update: 2024-07-07 12:27 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీలు మరోసారి గళమెత్తడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మారినా తమ సమస్యలు, పరిస్థితులు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దాంతో పాటు తమ జీతాలను కూడా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసమే జూలై 10న తాము రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నామని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఏర్పాడిన టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తమ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతిలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధర్వ్యంలో సమావేశం జరిగింది. అందులో సుబ్బరావమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

‘వీరోచిత పోరాటం చేశాం’

‘‘గత ప్రభుత్వ హయాంలో మాకు అన్యాయం జరిగింది. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అందుకే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 42 రోజుల పాటు వీరోచితంగా పోరాటం చేశాం. ఆ సందర్భంగానే ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. ఆనాడు మేము చేసిన పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలు కూడా మా శిబిరాల దగ్గరకు వచ్చి మద్దతు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు’’ అని గుర్తు చేశారు.

నెలరోజులైనా పట్టించుకోరే

‘‘రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి నెల రోజులు ముగిశాయి. అయినా అంగన్వాడీల సమస్యలపై కనీసం ఆరా కూడా తీయలేదు. ఈ నేపథ్యంలోనే మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పటికే మా సమస్యల పరిష్కారానికి సంబంధిత మంత్రికి వినతి పత్రం కూడా సమర్పించాం. ఇప్పటికే మా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వెల్లడించారామే.

యాప్‌ల భారం మాకొద్దు

‘‘సమస్యల పరిష్కారం కోరడంతో ఎఫ్ఆర్ఎస్ యాప్ పేరుతో వేధించొద్దు. అది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికే యాప్‌ల భారంతో అల్లాడిపోతున్నాం. అలాంటి అంగన్వాడీలను యాప్‌ల భారం నుంచి మినహాయింపు అందించండి. ఇప్పుడు కొత్తగా మరోసారి ఎఫ్ఆర్ఎస్ యాప్‌ పేరుతో ఫేస్ రికగ్నియషన్ యాప్‌ను ప్రవేశపెట్టడం ఏమాత్రం సరైనది కాదు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

ఇలానే జరిగితే బలహీనపడం ఖాయం

‘‘కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గతేడాది ఐసీడీఎస్‌ కోసమని నిధుల నుంచి రూ.300 కోట్లు కోత వేసింది. ఆ ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగితే ఐసీడీఎస్ బలహీనపడటం ఖాయం. ఐసీడీఎస్ బలోపేతం కోసం కేంద్రం రూ.50 కోట్ల నిధులను కేటాయించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈనెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాలని, వారికి తగినంత నిధులు కేటాయించాలని కోరారు.

కక్ష్యసాధింపు చర్యలు ఆపండి

‘‘తమ పాలనలో కక్ష్య సాధింపు చర్యలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఆ మరుసటి రోజు నుంచే అనేక ప్రాంతాల్లో స్కీం వర్కర్లను ముఖ్యంగా అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లకు స్థానిక నేతలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పార్టీ పేర్లు పెట్టి తొలగింపులకు పాల్పడుతన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకే పాల్పడి ప్రజల్లో అభాసు పాలైంది’’ అని పేర్కొన్నారు సుబ్బవరమ్మ.

‘‘అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వమైనా పారదర్శకంగా వ్యవహరించాలి. కుట్రపూరిత విధానాలతో ఒరిగేదేమీ లేదు. ప్రజల్లో పలుచన కావడం తప్ప’’ అని సూచించారు. అంతేకాకుండా అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కూడా చంద్రబాబు ప్రభుతవం చొరవ తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం సమయంలో జరిగిన ఒప్పందం మేరకు జూలై నెల నుంచి జీతాలు పెరగాల్సి ఉందని, ఆ ఒప్పందం ప్రకారమే జీఓలను కూడా విడుదల చేయాలని ఆమె కోరారు.

Tags:    

Similar News