ఆ పల్లెకు సంక్రాంతి వచ్చింది..!

చిత్తూరు జిల్లాలో ముందస్తుగానే సంక్రాంతి వచ్చిందా? ఆగస్టులో జల్లికట్టు నిర్వహించడం ద్వారా ఓ సినిమా హాస్య సన్నివేశాన్ని గుర్తుకు తెప్పించారు.

Update: 2024-08-11 13:49 GMT

ఆ పల్లెలకు ముందుగానే సంక్రాంతి వచ్చింది. పొట్లగిత్తలు రంకెలు వేశాయి. జల్లికట్టుతో ఊరంతా సందడిగా మారింది. వీధుల్లో పరిగెత్తుతున్న కొడెగిత్తలు. వాటిని వెంటాడుతున్న యువకులు కొందరు, ఈలలు, కేకలతో ఈకలు, కేకలతో నిలువరించాలని ఇంకొందరు యువకుల ఉత్సాహం.

ఈ సందడిని చూసేందుకు మిద్దెలపై చేరిన జనం. లేని పండుగతో సృష్టించిన ఆనందంతో ఆ పల్లె మొత్తం సందడిగా మారింది.

సాధారణంగా తెలుగువారికి జనవరి నెలలో మాత్రమే సంక్రాంతి వస్తుంది. కానీ చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెలో మాత్రం ముందస్తు సంక్రాంతి వచ్చిందో..! లేక సార్వత్రిక ఎన్నికల విజయం సంక్రాంతి తెచ్చిపెట్టిందో జనానికి అర్థం కాని స్థితి ఏర్పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిర్వహించే సాహస క్రీడ జల్లికట్టు. ఎటు కాకుండా ఆగస్టు నెలలో ఈ జల్లికట్టు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణుల ఉత్సాహానికి అద్దం పట్టింది. ఈ వ్యవహారం చూస్తే ఓ సినిమా సరదా సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోక తప్పదు.

"కళ్ళు చిదంబరం తన మ్యారేజ్ డే అని స్వీట్లు పంచుకుంటూ వస్తుంటాడు. వెనుక నుంచి

హ్యాపీ హోలీ పండుగ.. హోలీ పండుగ.. అని బ్రహ్మానందం రంగునీళ్ళు కుమ్మరిస్తాడు"

డిసెంబర్ లో హోలీ ఏంటి? బుద్ధి లేకుండా అని

కళ్ళు చిదంబరం రుసరసలాడతాడు.

ఏ..డిసెంబర్లో హోలీ పండుగ చేసుకోకూడదా? అని బ్రహ్మానందం ప్రశ్నిస్తాడు.




 

అదే సమయంలో..

సీన్లోకి హాస్యనటుడు వేణుమాధవ్ తో కలిసి సుధాకర్ ఎంట్రీ ఇస్తాడు.

మామా ఇది టుమచ్.. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్. అనగానే..

ఏంటయ్యా ఇది.. ఈరోజు హోలీ ఏంటి అని తనికెళ్ల భరణి మందలించే ధోరణిలో బ్రహ్మానందాన్ని ప్రశ్నిస్తారు.

నాకు సంతోషంగా ఉన్నప్పుడే హోలీ పండుగ అనే బ్రహ్మానందం సమాధానంతో... వారందరికీ తిక్క రేగుతుంది.

నేయబ్బ నీ సంగతి ఇట్టకాదు.. అని

హాస్యనటులు సుధాకర్, వేణుమాధవ్ కనుసైగ చేసుకుంటారు.

బోలో గణేష్ మహారాజ్ కి జై. అని వారిద్దరూ గట్టిగా అరవగనే..

బ్రహ్మానందం బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్పా మోరియా అంటూ చిందులు వేస్తారు.

ఈరోజే నాయక చవితి అని తనికెళ్ల భరణి అనగానే, ఈయనే మా వినాయకుడు బ్రహ్మానందంపై సెటైర్ వేసి వారంతా ఆట పట్టిస్తారు.

వినాయకుడికి తొండం, చెవులు పెద్దవి వుండాలి కదా.. అని బ్రహ్మానందాన్ని చెడుగుడు ఆడుకుంటారు. చివరికి నీటిలో వేసి బుద్ధి చెబుతారు"

పెళ్లి చేసుకుందాం సినిమాలోని సరదా సన్నివేశం ఇది.

ఈ హాస్య సన్నివేశాన్ని తలపించే రీతిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని కావలివారిపల్లెలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పశువుల పండగ ఇది.




 

ఇదో సాహస క్రీడ

సాధారణంగా సంక్రాంతి పండుగల్లో ఈ తరహా జల్లికట్టు నిర్వహించడం తమిళనాడు తర్వాత చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఈ జల్లికట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

ఇప్పుడు ఎక్కడ జరిగింది

తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎస్. రంగంపేట, పాకాల మండల లోని అనేక గ్రామాలలో సంక్రాంతి తర్వాత పశువుల పండుగ అంటే జల్లికట్టు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ముందుగానే ప్రకటిస్తారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా హాజరవుతారు. తమ గ్రామము నుంచి పశువులను కూడా తోలుకొని వస్తారు. ముందుగానే పశువులను ముస్తాబు చేస్తారు. వాటి కొమ్మలకు పలకలు కట్టి అందులో బహుమతులు కూడా ఉంచుతారు. ఆ కోడిగిత్తలను నిలవరించి బహుమతి దక్కించుకున్న యువకులకు సన్మానం చేస్తారు. ఇందుకోసం ముందుగానే ముస్తాబాద్ చేసిన పోట్ల గిత్తలను వీధుల్లో పరుగులు తీయించి, సందడి చేస్తారు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కొన్ని రోజుల వరకు ఈ తరహా ఉత్సవాలు నిర్వహించడం చిత్తూరు జిల్లా పల్లెల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే,




 

ఇప్పుడు జల్లికట్టు ఏంటో..!?

పాకాల మండలం కావలివారిపల్లెలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. ఆ గ్రామస్తులు ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే.. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని ఓటమి చెందారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మళ్లీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో పశువుల పండుగ నిర్వహించినట్లు చెబుతున్నారు.




 

టీడీపీ సంబరం

ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే కొడుకు పులివర్తి వినీల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనను మహిళలు హారతులతో స్వాగతించారు. యువత టపాకాయలు కాలుస్తూ సందడి చేశారు. అనంతరం, ముస్తాబు చేసిన కోడెగిత్తలను వీధుల్లో పరుగులు తీయించారు. ఆ పశువులను నిలువరించేందుకు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల నేతల ఫోటోలు కట్టిన పలకలను చేజించుకోవడానికి యువత పోటీపడ్డారు. పశువుల పండుగను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, యువత వేలాదిగా తరలివచ్చారు.

మొత్తానికి పాకాల మండలంలో ముందుగానే సంక్రాంతి వచ్చిందా? సందేహం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముందస్తు సంక్రాంతి తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News