సుప్రీం సీజేఐ గవాయ్‌పై బూటు విసరబోయిన లాయర్
సనాతన్ కి అవమానమంటూ సుప్రీం సీజేఐ గవాయ్ పై బూటు విసరబోయిన లాయర్
By : The Federal
Update: 2025-10-06 09:50 GMT
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) ఓ కేసు విచారణ సందర్భంలో ఒక న్యాయవాది బూటు విసరడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు. దీంతో కోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉదయం 11.35 గంటల సమయంలో కోర్టు నంబర్–1లో కేసుల ప్రస్తావన (మెన్షనింగ్)లపై వాదనలు కొనసాగుతుండగా, 71 ఏళ్ల న్యాయవాది రాకేశ్ కిశోర్ అకస్మాత్తుగా తన స్పోర్ట్స్ షూ విసరడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం సుప్రీంకోర్టు భద్రతా విభాగానికి అప్పగించారు. కోర్టు నుంచి ఆ న్యాయవాదిని బయటకు తీసుకువెళుతున్నప్పుడు..సనాతన ధర్మానికి భంగం కలిగించే సహించే ప్రసక్తే లేదని పెద్దగా నినాదాలు చేయడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాకేశ్ కిశోర్ మయూర్ విహార్‌కు చెందినవాడు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వం ఉంది. న్యాయవాదే అని ధృవీకరించారు.
కోర్టులోనే సీజేఐ ప్రతిస్పందన
ఈ ఘటనతో కలకలం చెలరేగినా సీజేఐ గవాయ్ మాత్రం ఏమాత్రం చలించలేదు. స్థిరంగా వ్యవహరించారు. “ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చేయవు. మనం వాదనలు కొనసాగిద్దాం, మీరు కూడా దృష్టి మరల్చకండి,” అని న్యాయవాదులకు సూచించారు.
మతభావోద్వేగాలే కారణమా?
సుప్రీంకోర్టులో ఈ ఆకస్మిక పరిణామం వెనుక ఇటీవల వెలువడిన మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. ఖజురాహోలో 7 అడుగుల విగ్రహం పునరుద్ధరణ కేసును కొట్టివేస్తూ, “మీరు భక్తులైతే దేవుడినే అడగండి... ఇది పురావస్తు విభాగం అనుమతి అవసరమయ్యే అంశం” అని సీజేఐ గవాయ్ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో కోర్టులోకి బూటు విసరడానికి యత్నించిన న్యాయవాది, బయటకు తీసుకెళుతున్నప్పుడు “సనాతన్‌కి అవమానం సహించం” అని నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. న్యాయవాది రాకేశ్ కిశోర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు ప్రాంగణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
గతంలో ఎప్పుడెప్పుడు జరిగాయంటే...
సుప్రీంకోర్టు సహా దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో ఇలాంటి అనూహ్య సంఘటనలు ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా జరిగాయి. ముఖ్యంగా న్యాయమూర్తులు లేదా కోర్టు ఆవరణలో దాడులు, దాడికి యత్నాలు, బూట్లు విసరడం, నినాదాలు చేయడం వంటి ఘటనలు అప్పుడప్పుడు జరిగాయి.
2009 – సుప్రీంకోర్టు: కర్ణాటక న్యాయవాది ఒకరు కోర్టు లో కేసు విచారణ జరుగుతున్న సమయంలో నినాదాలు చేశారు. దీంతో కోర్టులో ఏమి జరుగుతుందో అర్థం అయ్యే లోపు అతడిని వెంటనే బయటకు పంపి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
2015 – సుప్రీంకోర్టు: ఒక వ్యక్తి కేసుకు సంబంధం లేకుండా మధ్యలో లేచి నినాదాలు చేయడంతో సెక్యూరిటీ అతడిని బయటకు తీసుకెళ్లింది.
హైకోర్టుల్లో
2009 – ఢిల్లీ హైకోర్టు: న్యాయమూర్తులపై ఓ వ్యక్తి బూటు విసరడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2011 – పంజాబ్ & హర్యానా హైకోర్టు: ఒక కేసు తీర్పుపై అసంతృప్తితో నిందితుడు కోర్టు గదిలోనే హింసాత్మకంగా ప్రవర్తించాడు.
ఇతర రాజకీయ పరిణామాలు
భారతదేశంలో బూటు విసరడం ఒక ప్రతీకాత్మక నిరసన రూపం. ముఖ్యంగా 2009లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, గృహ మంత్రిగా ఉన్న పీ.చిదంబరంపై బూటు విసిరిన ఘటనలు గుర్తుండే ఉదాహరణలు. ఆ తర్వాత ఈ సంస్కృతి కోర్టు గదుల వరకు వ్యాపించింది.