వైసీపీ నేతలు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయో అని అటు వైసీపీ నేతలు, ఇటు అధికారులు హడలి పోతున్నారు.

Update: 2024-07-11 09:15 GMT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ఉన్నతాధికారుల పరిస్థితి దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది. ఎవరి మీద ఎప్పుడు, ఎలాంటి కేసులు పెడుతారో, అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయో అని అని బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారనే చర్చ సర్వత్ర సాగుతోంది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, మరో పక్క ప్రతీకార చర్యలపైన దృష్టి సారించిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు దీరక ముందే ఉన్నతాధికారులపై జూలు విదిల్చింది. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డిని సెలవులో వెళ్లమని బలవంతపు ఆదేశాలతో పాలన ప్రస్థానం ప్రారంభించింది. అదే సమయంలో గత ప్రభుత్వం తాలూకు పాలన, దానిలోని లోటు పాట్లు, జగన్‌ ప్రభుత్వంలో చోటు చేసుకున్న నిధుల దుర్వినియోగం, గత ఐదేళ్లల్లో జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు వంటి పలు అంశాలపై దృష్టి సారించింది. తాము ఎలా పాలన సాగిస్తామని కాకుండా గత ప్రభుత్వం లోపాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చెప్పాలనే ఆలోచనల్లో ఉంది. అందులో భాగంగా గత ఐదేళ్లల్లో రాష్ట్ర స్థితిగతులపై శ్వేత పత్రాలు విడుదల చేసే పనిలో ఉంది. ఏడు శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్లు ఇది వరకు ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు పోలవం, అమరావతి, విద్యుత్‌ రంగంపై మూడు శ్వేత పత్రాలను విడుదల చేసింది. గత ప్రభుత్వం పోలవం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని, అమరావతిని శిధిలావస్థకు చేర్చిందని, విద్యుత్‌ రంగంలో భారీ ఎత్తున నష్టాన్ని మిగిల్చిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం గమనార్హం. ఇంకా నాలుగు రంగాలపై శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకు అవసరమైన సమీక్షలతో సంబంధిత మంత్రులు, అధికారులు నిమగ్నమయ్యారు.
ఇలా గత ప్రభుత్వం తాలూకా లోటు పాట్లను ప్రజలకు ఎత్తి చూపుతూ, నాటి జగన్‌ ప్రభుత్వంపైన విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఇదంతా ఒక వైపు అయితే.. మరో వైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, నేతలు, కార్యకర్తలపై దృష్టి సారించింది. గత ప్రభుత్వం హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు టీడీపీ కార్యాలయాలపై వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు చేసిన దాడులను తెరపైకి తెచ్చింది. ఈ ఘటనలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. దాడులకు పాల్పడిన నేతలు, కార్యకర్తలతో పాటు వెనుకుండి వాటిని నడిపించారనే కారణాలతో ఆ పార్టీ కీలక నేతలను సైతం జైళ్లకు పంపాలనే దిశగా చర్యలు ముమ్మరం చేసిందనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో కీలక నేతగాను, ప్రభుత్వ సలహాదారుగాను వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి వంటి కీలక నేతలు ముందస్తు బెయిళ్ల కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాడుల్లో ప్రమేయం ఉన్న కొంత మంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారనే విమర్శలు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల్లో కూడా కంటి మీద కునుకు లేకుండా పోయింది. మరి ముఖ్యంగా అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల్లో కూడా ఆందోళనలు నెలకొన్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనే కారణంతో ఇప్పటికే పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లను పక్కన పెట్టింది. ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడీకి అటాచ్‌ చేసింది. పీ సీతారామాంజనేయులు వంటి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు సీఎంను కలిసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా ఇద్దరు అధికారులపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులకు చెమటలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా అధికారిగా పని చేసిన ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా పని చేసిన విజయ్‌కుమార్‌రెడ్డిపైన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. వీరితో పాటు వీరిద్దరికీ సహకరించిన ఇతర ఉద్యోగులను విచారణ చేయాలని దిశా నిర్థేశం చేసింది. రానున్న రోజుల్లో ఇలాంటి అధికారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి నిర్ణయాలు తెరపైకి వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న అధికారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడం అధికారులకు ముందరికి వెళితే గొయ్య.. వెనకకు పోతే నుయ్యి అన్న చందంగా మారిందనే టాక్‌ అధికార వర్గాల్లో నడుస్తోంది.
Tags:    

Similar News