చంద్రబాబు విశ్వాసపాత్రుడు నెట్టెం రఘురాంకి కీలక పదవి

చంద్రబాబు నాయుడు అనుంగు అనుచరునిగా పేరున్న ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు నెట్టెం రఘురాంను కేడీసీసీ ఛైర్మన్‌ పదవి వరించింది.;

Update: 2025-04-29 12:33 GMT
Nettem Raghu Ram with Chandrababu Naidu
ఎన్టీఆర్ అభిమాని, చంద్రబాబు నాయుడు అనుంగు అనుచరునిగా పేరున్న ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నెట్టెం రఘురాంను కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీ)ఛైర్మన్‌ పదవి వరించింది. రాజకీయాల్లో వివాద రహితుడు, అజాత శత్రువుగా నెట్టెంకు పేరుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఆయనకు పదవి దక్కడంపై జగ్గయ్యపేట నియోజకవర్గ తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. నెట్టెం మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా సేవలందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 2024లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని విజయవాడ ఎంపీ, ఏడుగురు శాసన సభ్యుల గెలుపులో ఆయన కీలకపాత్ర పోషించారు.
ఎల్‌ఎంబీ డైరెక్టర్‌గా రాజకీయ ప్రవేశం
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నెట్టెం రాజకీయాల్లో ఉన్నారు. తొలిసారిగా 1981లో ఎల్‌ఎంబీ(ల్యాండ్‌ మార్కెటింగ్‌ బ్యాంకు) డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. రాజకీయంగా ఎదిగి ఎన్టీఆర్‌ దృష్టిలో పడ్డారు. 1985లో జరిగిన ఎన్నికల్లో అనుహ్యంగా సీటు సాధించి తొలిసారి జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు జగ్గయ్యపేట నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.

 చంద్రబాబు క్యాబినెట్‌లో అబ్కారీ శాఖ మంత్రిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా సాగినా జగ్గయ్యపేటలో అప్పటి మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావుపై గెలిచారు. ఆ తర్వాత 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతగా కొనసాగుతున్న శ్రీరాం తాతయ్యను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి, సీటు ఇప్పించి ఎన్నికల్లో గెలిపించారు. ఇదే కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న తొండపు జనార్దన్‌ మొదట జిల్లా బ్యాంక్‌కు, ఆ తర్వాత అబ్కాబ్, నాబ్కాబ్‌ ఛైర్మన్‌గా ఎదిగారు.

Tags:    

Similar News