క్లస్టర్ల ఆధారంగా నైపుణ్య శిక్షణ : లోకేష్
క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని... స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎంకు వివరించారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్య పోర్టల్ అభివృద్ధి చేయడమే కాకుండా... నైపుణ్య కల్పనలో దేశ, విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ-అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ది పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్యం పోర్టల్ తీర్చిద్దాలన్నారు. అభ్యర్ధులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో... ఆ అవకాశాన్ని పొందేలే వివరాలు పోర్టల్‌లో పొందుపరచాలని సీఎం సూచించారు.
అన్ని శాఖలు, విభాగాల డేటా అనుసంధానం
ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్ధులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. వాట్సప్ ద్వారా ఉద్యోగావకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటా బేస్ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తిస్తున్నామని అధికారులు వివరించారు. ఎక్కడ, ఏ రంగంలో శిక్షణ అందిస్తున్నాం, జాబ్ మేళాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, ఏయే సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే దానిపై పోర్టల్ నుంచి అభ్యర్ధులకు సమాచారం అందేలా తీర్చిదిద్దామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఉద్యోగార్దులు ఇంటర్వూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్ సైతం నైపుణ్యం పోర్టల్‌లో అందుబాటులో ఉందన్నారు.
విదేశీ భాషల్ని నేర్చుకునేలా శిక్షణ
‘పోర్టల్‌లో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించాలి. విద్యా సంస్థలకు ఫ్యూచర్ ట్రెండ్స్ తెలిసేలా చేయాలి. ప్లేస్మెంట్ వివరాలనూ ట్రాకింగ్ చేసేలా ఉండాలి. స్కిల్ టెస్టింగ్‌కు కూడా అవకాశం కల్పించాలి. పాఠశాల స్థాయిలో విద్యార్ధుల నూతన ఆవిష్కరణలను మరింత ఉన్నతీకరించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానించాలి. విదేశాల్లో ఉద్యాగావకాశాలు సులభంగా పొందేందుకు వీలుగా ఆయా దేశాల స్థానిక భాషలను నేర్చుకునేలా శిక్షణ అందించాలి. ఏపీ ఎన్‌ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలి. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏపీలో యువత అందరికీ ఏ రంగంలో నైపుణ్యం కావాలో దానికి సంబంధించిన శిక్షణ... అలాగా ప్రస్తుతమున్న సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేలా పున:శిక్షణ, ఉత్తమ శిక్షణ అందించాలి.’ అని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.