రుషికొండ కోసం చంద్రబాబు,పవన్,లోకేష్‌ పోటీ పడుతున్నారు

కూటమి నాయకులకు రుషికొండ అనేది ఒక పర్యాటక ప్రాంతాంగా మారిపోయిందని అమర్నాథ్‌ ధ్వజమెత్తారు.;

Update: 2025-08-30 09:06 GMT

రుషికొండ ప్యాలెస్‌ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ పోటీపడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. రుషికొండ భవనాలను వాడుకోవడం కోసం ఈ ముగ్గురి మధ్య పోటీ నెలకొందని, అందుకే ఎవరికి వారు పోటీలు పడుతూ సెల్పీలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనం సీలింగ్‌ కట్‌ చేశారని, అలా కట్‌ చేసిన ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ ఫోట్‌ షూట్‌ చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అమరావతిలో కట్టిన సచివాలయం చిన్నపాటి వర్షానికే కారిపోతుందన్నారు. చదరపు అంగుళానికి రూ. 13వేలు పెట్టి కట్టిన సచివాలయం అలా లీకవుతోంటే పవన్‌కు అవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు రూ. 200 కోట్లతో హైదరాబాద్‌లో పెద్ద ఇంద్రభవనం వంటి పెద్ద భవనం కడితే పవన్‌ కల్యాణ్‌కు అది పూరి గుడెస గా కనబడుతోందని, అదే చంద్రబాబు అమరావతిలో ఐదు ఎకరాల్లో రాజభవనం మాదిరిగా ఇల్లు కడితే అది స్కీమ్‌లో కట్టిన ఇల్లుగా కనిపిస్తోందని, వైఎస్‌ జగన్‌ ఇల్లు కట్టుకుంటే అది మాత్రం ప్యాలెస్‌లుగా వారికి కనిపిస్తోందని మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్‌ను జగన్‌ ప్యాలెస్‌ అని అంటున్నారని, మరి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ అనేది జగన్‌ ప్యాలెస్‌ అని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని డైవర్ట్‌ చేసేందుకు కూటమి నాయకులు ఈ రుషికొండ పేరుతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ భవనాల విషయాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. సమస్యల నుంచి ప్రజలను దారి మళ్లించడం కోసం కూటమి నాయకులు ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రుషికొండ భవనాలు రిసార్డ్‌ సెంటర్‌ ఎందుకు జీవో ఇచ్చారని, జగన్‌ ప్యాలెస్‌ అని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్‌ చేసేందుకే ఈ తరహా డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
ఎన్నికలకు ముందు స్టీల్‌ ప్లాంట్‌ కోసం విశాఖ ఉక్కు నా ఆత్మ అంటూ చంద్రబాబు మాట్లాడారని, విశాఖ స్టీల్‌ను ప్రవేటీకరణ కాకుండా చూస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని, కానీ ప్రస్తుతం విశాఖ ఉక్కు ఆస్తులను అమ్మేస్తుంటే కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈవెంట్ల కోసం అమరావతిని వాడుకుంటున్నారని, స్టీల్‌ ప్లాంట్‌ అంశంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌లు చేతకాని వ్యక్తుల్లా మిగిలి పోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ల చేతకాని తనం వల్ల విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీని వల్ల వేలాది మంది స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు రోడ్డున పడ్డారని గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు.
Tags:    

Similar News