కురుపాం,అనంతపురం ఘటనలపై చంద్రబాబు సీరియస్
మంత్రి సంధ్యారాణి , అధికారులతో సమీక్ష ,నివేదిక ఇవ్వాలని ఆదేశం
By : V V S Krishna Kumar
Update: 2025-10-05 12:50 GMT
కురుపాం బాలికల గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.కురుపాం ఘటనతో పాటు ,అనంతపురం లో పసికందు మృతి పైనా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణి, అధికారులతో ఆయన మాట్లాడారు.ఈ ఘటనలపై అధికారులు తీసుకున్న చర్యల గురించి వివరాలు తెలుసుకున్నారు. కురుపాం విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని , ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతపురం శిశుసంరక్షణ కేంద్రంలో పసికందు మృతిపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి ఆరా
సీఎం ఆదేశాలతో మంత్రి సంధ్యారాణి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ,మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. పచ్చకామెర్ల బారినపడిన 85 మంది బాలికలకు విశాఖ కేజీహెచ్, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కురుపాం గురుకుల పాఠశాలలో బాలికలకు అస్వస్థతపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. కలెక్టర్, వైద్యారోగ్య శాఖాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు వైద్య సిబ్బందిని పంపాలని సూచించారు. ఏకలవ్య, గురుకులాల్లో శుభ్రత, ఆహార నాణ్యతపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఇలావుంటే పార్వతీపురం ఆసుపత్రిలో గురుకులం సెక్రటరీ గౌతమి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థినిలు పచ్చకామెర్ల బారిన పడడానికి గల కారణాలు అన్వేషిస్తున్నట్లు మీడియాకు చెప్పారు.ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నారని గౌతమి పేర్కొన్నారు. నీటి వల్ల ఈ వ్యాధి వచ్చిందనే అనుమానంతో అక్కడ వాటర్‌ను పరీక్షించినట్లు తెలిపారు. నీటిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయిందని వివరించారు. పచ్చకామెర్లు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థినులు మొత్తం 36 మంది ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 120 మంది విద్యార్థినిలు చికిత్సపొందుతున్నట్లు గౌతమి వెల్లడించారు.
మరోవైపు అనంతపురం శిశుసంరక్షణ కేంద్రంలో పసికందు మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.సిబ్బంది మధ్య వివాదంతో బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమని ఆరోపణలున్నాయి. మరోవైపు సంబంధిత అధికారులు పసికందు మృతికి అనారోగ్యమే కారణమని చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని బాధ్యులపై చర్యలకు ఆదేశించింది.