పొదిలిలో గలాటా చేయించింది చంద్రబాబే

రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది..అంటూ సీఎం చంద్రబాబుపై జగన్‌ మండిపడ్డారు.;

Update: 2025-06-14 06:04 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు సమస్యలను వెలుగులోకి రానీకుండా.. వాటి మీద గొంతెత్తనీకుండా డైవర్ట్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు తాను పొదిలికి వెళ్తే అక్కడ టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి, వారితో ప్రజలుపైన, రైతులపైన దాడులు చేయించింది మీరు కాదా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. మీరే మీవాళ్లతో దాడులు చేయించడమే కాకుండా మళ్లీ ప్రజలు, రైతులపైనే కేసులు పెడుతున్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారో అర్థం అవుతుందని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆ మేరకు శనివారం సోషల్‌ మీడియా వేదికగా జగన్‌ స్పందించారు.

జగన్‌ ఏమన్నారంటే..
సీఎం చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు.
కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారూ? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ? రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా, ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది. అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. 


Tags:    

Similar News