FOREST LANDS | పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

అటవీ భూముల కబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కబ్జా ఆరోపణలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది.;

Update: 2025-01-29 11:02 GMT
చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy) చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. అటవీ భూముల కబ్జా ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఆయన్ని విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పందించిన తీరు అలాగే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా స్పర్థలు కూడా ఉన్నాయి. వీటికి ప్రస్తుత అటవీ భూముల వ్యవహారం తోడైనట్టు చెబుతున్నారు. ఆక్రమణల వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా పెద్దిరెడ్డి మాత్రం దేనికైనా సిద్ధమే అంటున్నారు.
పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఏమిటంటే..
పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ భూముల్ని పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు ఆక్రమించినట్టు ఆరోపణలు వచ్చాయి. అటవీ శాఖ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ విషయమై విచారణ జరపాలని పట్టుబట్టారు. దీంతో భూ ఆక్రమణల ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన అధికారులు విచారణ జరిపి నివేదికలు సిద్ధం చేశారని తెలిసింది. సుమారు 75 ఎకరాల అటవీ భూములు ఆక్రమణలకు గురైనట్టు అధికారులు గుర్తించారని, ఆక్రమణలు చేసిన వారిలో పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారని తెలుస్తోంది. అధికారులు సిద్ధం చేసిన ఈ నివేదిక సీఎం వద్దకు చేరినట్టు సమాచారం.
75.75 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ అధికారుల బృందం ఇచ్చిన నివేదిక ఇప్పుడు సీఎం చంద్రబాబు టేబుల్ మీదికి చేరింది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన వెంటనే పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం, మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిథిలో భూ అక్రమాలపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. దీంతో సంతృప్తి చెందని సీఎం సమగ్ర నివేదిక కోరినట్లు తెలిసింది. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సంబంధిత శాఖలు సీరియస్ గా తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయికి సీఎంవో నుంచి వెళ్లాయి. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారు చేసినట్టు తెలుస్తోంది. వెంటనే పూర్తిస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించటంతో ప్రభుత్వం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్​లను జాయింట్ కమిటీలో సభ్యులుగా నియమించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. పక్కా అధారాల సేకరణతో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అటవీశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పెద్దిరెడ్డి కుటుంబ భూ అరాచకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఆరా తీస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.
పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు, బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Tags:    

Similar News