పిల్లలూ బాగున్నారా..చంద్రబాబు టీచరయ్యారు

నిత్యం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమావేశాలతో బిజీ బిజీగా ఉంటే సీఎం చంద్రబాబు గురువారం టీచర్‌గా మారారు.;

Update: 2025-07-10 07:26 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉపాధ్యాయుడుగా మారారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్‌ కమిటీ సమావేశానికి మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొద్ది సేపు ఉపాధ్యాయుడిగా మారారు. తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. ఏం పిల్లలు బాగున్నారా అంటూ తరగతిలోకి ఎంట్రీ ఇచ్చారు. చేతిలో పాఠ్యపుస్తకం పట్టుకుని ‘వనరులు’ అనే పాఠ్యాంశం మీద తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. వనరులు ఎన్ని రకాలు, అవి ఎలా ఉపయోగపడుతాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే పలు అంశాల మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మద్య మధ్యలో విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ.. వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలు చేసే అలవాటు ఉండటం వల్ల సహజంగా ఆయన నుంచి వచ్చే కొన్ని పదాలు అక్కడక్కడా దొర్లినా.. విద్యార్థులకైతే వనరుల పాఠం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. భవిష్యత్‌లో ఏమి కావాలనుకుంటున్నారనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తరగతిలో పాఠాలు చెబుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్‌ కూడా పిల్లలతో కూర్చుని శ్రద్ధగా విన్నారు.

అంతేకాకుండా విద్యార్థులతో నేరుగా ముఖా ముఖి నిర్వహించారు. ఓ విద్యార్థి మార్కుల జాబితాను పరిశీలించిన ఆయన మంచి మార్కులు తెచ్చుకున్నందుకు ఆ విద్యార్థిని అభినందంచిన సీఎం చంద్రబాబు మధ్యలో తరగతులకు ఎందుకు హాజరు కాలేదని ఆ విద్యార్థిని ప్రశ్నించారు. జ్వరం వల్ల రాలేక పోయానని ఆ విద్యార్థి చెప్పగా.. పక్కనే ఉన్న ఆ విద్యార్థి తల్లిని అడిగి క్లారిటీ తీసుకున్నారు. తరగతులకు తప్పకుండా హాజరు కావాలని, ఇప్పుడు కంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుని జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని, మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని ఆ విద్యార్థికి సీఎం సూచించారు. తల్లికి వందనం అందిందా లేదా అని ఆరా తీసిన సీఎం ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు అందాయా లేదా అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం అందిందని, పుస్తకాలు, బ్యాగ్‌లు కూడా అందాయని ఆ విద్యార్థి తల్లి సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.
Tags:    

Similar News