‘బనకచర్ల’ కలిపింది

ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కలుసుకున్నారు.;

Update: 2025-07-16 10:59 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ర్డెలు బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న పలు నీటి వివాదాలు, బనకచర్ల ప్రాజెక్టుపైన చర్చేందుకు కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమక్షంలో సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చిన బనకచర్ల ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు గోదావరి నదిపైన నిర్మించాలని తెరపైకి తీసుకొచ్చిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన పలు నీటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అటు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల–పోలవరం ప్రాజెక్టును, ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 10 నీటి అంశాలను ఈ చర్చలో అజెండాగా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్, ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేష్‌ శాఖ అధికారులు, ఇంజనీర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశానికి కంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు ఎవరికి వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో ప్రస్తావించాల్సిన, చర్చించాల్సిన అంశాలపైన, సమాధానాలపైన ఇరు రాష్ట్రాల బృందాలు కూలంకుశంగా చర్చించుకున్నారు. ఢిల్లీలోని సీఎంల అధికారిక నివాసాల్లో ఎవరికి వారు ప్రత్యేకంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.
Tags:    

Similar News