ఢిల్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ

అంబేద్కర్‌పై అమిత్‌ షా అనుచిత వ్యాఖ్యలు ఎన్డీఏకి ఎంత మేరకు చేటును కలిగిస్తాయి. ఎంత మేరకు ఉపయోగం చేకూరుస్తాయనే దానిపై చర్చించినట్లు తెలిసింది.

Update: 2024-12-25 12:25 GMT

కేంద్ర ప్రభుత్వం పెద్దలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భేటీ అయ్యారు. మాజీ ప్రధాని, బీజేపీ అగ్ర నేత అటల్‌ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేతలంతా సమావేశం అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఎన్డీఏ మిత్ర పక్షాల నాయకులు ఈ సమావేశంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఎన్డీఏ నేతలైన జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్, అప్నాదళ్‌(ఎస్‌) అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, జేడీఎస్‌ నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, హిందూస్థానీ అవామ్‌ మోర్చా(ఎస్‌)నాయకుడు, కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ, ఆర్‌ఎల్‌ఎం అధ్యక్షులు ఉపేంద్ర కుష్వాహా, భాతర్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షులు తుషార్‌ వెల్లప్పల్లి వంటి నేతలు భేటీలో పాల్గొన్నారు.

దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో హోం మంత్రి అమిత్‌ షా అంబేద్కర్‌ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారాయి. అంబేద్కర్‌ను అమిత్‌ షా అవమానించారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఒక్క సారిగా బీజేపీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలపైన, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైన దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యతిరేకత నెలకొంది. ప్రజాస్వామ్య పక్షాలు, ఇండియా కూటమి, ప్రజా సంఘాలు, దళిత, బహుజన శ్రేణులు అమిత్‌ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు కోరాలని తీవ్ర స్థాయిలో గళం విప్పారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెరిన వ్యతిరేకతను ఎలా న్యూట్రల్‌ చేయాలి, తమ వైపు ఎలా తిప్పుకోవాలనే దానిపైన చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన జమిలీ ఎన్నికల బిల్లులపైన చర్చించినట్లు తెలిసింది. భారీగా వ్యతిరేకత పెరిన నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఏమేరకు తమకు ఫలితాలిస్తాయనే దానిపై చర్చించినట్లు సమాచారం. మరో వైపు జమిలీ ఎన్నికల బిల్లుపై పీపీ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు త్వరలో రానుంది. దీనిపై జనవరి 8న జేపీసీ సమావేశం కానుంది. 

Tags:    

Similar News