బటన్ నొక్కే పంపిణీ కాదు, బడుగుల మధ్యనే పంచుతాం!!
నవంబర్ నెలకి సీఎం చంద్రబాబు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ ఎక్కడంటే..
By :  The Federal
Update: 2025-10-31 06:13 GMT
Pawan kalyan, Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలనెలా ఇచ్చే వృద్ధాప్య పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ఒక జిల్లాను ఎంచుకుంటున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదును లబ్ధిదారులకు పంపగా చంద్రబాబు అందుకు భిన్నంగా ఒక్కో జిల్లాలకు వెళ్లి అక్కడ పెన్షన్లు పంపిణీ చేసిన వెంటనే సంబంధిత అధికారులు పెన్షన్ దారులకు నగదు పంపిణీ చేస్తున్నారు.
అక్టోబర్ నెలలో నంద్యాల జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడను ఎంచుకోగా నవంబర్ నెలకు శ్రీసత్యసాయి జిల్లాను ఎంచుకున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. జిల్లాలో నవంబరు నెలకు 2,64,802 మందికి రూ.115.92 కోట్ల పింఛన్ సొమ్ము మంజూరైంది. పెద్దన్నవారిపల్లిలో జరిగే పింఛన్‌ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. గ్రామంలో 756 మంది లబ్ధిదారులు ఉన్నారు.
రాష్ట్ర స్థాయిలో పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 65.50 లక్షల మందికి పైగా వృద్ధాప్య-సామాజిక సంక్షేమ పింఛన్లు అందుతున్నాయి. NTR Bharosa Pension Scheme  కింద పింఛన్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ. 2,717 కోట్లు పంపిణీ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని గ్రామాల్లోకి వెళ్లి ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. గ్రామ స్థాయిలో కార్యాచరణల ద్వారా లబ్ధిదారుల వరకు చేరుకోవడం కీలకమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, “బటన్ నొక్కటం కాదు, ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం నిజమైన సేవ” అని పేర్కొన్నారు. 
పంపిణీ మొదలు కావడానికి ప్రతి నెలా ప్రత్యేక జిల్లా ఎంపిక చేయటం ద్వారా ప్రాంతీయ సమానత్వాన్ని, ప్రజలకు దగ్గరై సేవలను అందించడం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ ప్రణాళిక ప్రతిఏ నెలా ఒక జిల్లాను వ్యక్తిగతంగా ఎంపిక చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం కొత్త మోడల్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రత్యక్ష హాజరుతో ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యత కూడా లభిస్తోంది.