బీఆర్ఎస్ ఎంఎల్ఏల ఫిరాయింపుల వెనుక బిగ్ బాస్ ?

వాళ్ళ మధ్య ఏమి చర్చలు జరిగిందో ఎవరికీ తెలుదుకాని ఆ తర్వాతే బీఆర్ఎస్ ను వదిలేయాలని ప్రకాష్ డిసైడ్ అయినట్లు సమాచారం.

Update: 2024-07-13 07:10 GMT

వినటానికి విచిత్రంగానే ఉన్నా క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గౌడ్ చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంఎల్ఏల సంఖ్య 8కి చేరుకుంది. శనివారం శేరిలింగంపల్లి ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు. వీళ్ళచేరిక వెనుక బిగ్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఉండటమే కారణమని ప్రచారంలో ఉంది.

ఇప్పటికే కాంగ్రెస్ లో ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎంఎల్ఏ బండ కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య హస్తంగూటికి చేరుకున్న విషయం తెలిసిందే. తొందరలోనే మరింతమంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పార్టీలో చేరిన ప్రకాష్ గౌడ్ చెప్పారు. ఈనెల 24 లేదా 25వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి. ఆలోపే బీఆర్ఎస్ కు చెందిన 27 మంది ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు.

రేవంత్ టార్గెట్ ఏమిటంటే బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేసుకోవటమే. 38 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో 27 మందిని లాగేసుకుంటే కారుపార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది. అలాగే బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవచ్చు. చీలికవర్గం ఎంఎల్ఏలు అసెంబ్లీలో తమదే అసలైన బీఆర్ఎస్ అని స్పీకర్ కు లేఖ రాస్తారు. తర్వాత స్పీకర్ వాళ్ళని బీఆర్ఎస్ ఎంఎల్ఏలుగా గుర్తించే అవకాశముంది. అప్పుడు ఆ గ్రూపును కాంగ్రెస్ లో విలీనం చేసుకనేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇదంతా జరిగేంతవరకు కారుపార్టీ ఎంఎల్ఏలను రేవంత్ లాక్కుంటునే ఉంటారనటంలో సందేహంలేదు.




 ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాజాగా పార్టీలో చేరిన ప్రకాష్ చాలా రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరాల్సుంది. అయితే ఎందుకనో వెనక్కు తగ్గారు. ఆయన మద్దతుదారుల్లో మెజారిటి నేతలు, క్యాడర్ బీఆర్ఎస్ ను వదలటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో తాను బీఆర్ఎస్ లోనే కంటిన్యు అవుతున్నట్లు ప్రకాష్ ప్రకటించారు. అయితే సడెన్ గా కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు ? ఎందుకంటే నాలుగు రోజుల క్రితమే చంద్రబాబునాయుడుతో ప్రకాష్ భేటీ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబుతో రాజేంద్రనగర్ ఎంఎల్ఏ, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధి  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళ మధ్య ఏమి చర్చలు జరిగిందో ఎవరికీ తెలుదుకాని ఆ తర్వాతే ప్రకాష్, గాంధీ బీఆర్ఎస్ ను వదిలేశారు. 




ఫిరాయింపులపై గతంలో గాంధి ఎప్పుడు మాట్లాడినా తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని చాలా స్పష్టంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీని ఎవరు వదిలేసినా ఎంతమంది వెళ్ళిపోయినా తాను మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటానని కేసీయార్ తోనే గాంధి స్పష్టంగా చెప్పారు. అలాంటి గాంధీ కూడా బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవటం వెనుక కారణం ఏమిటి ? అదికూడా చంద్రబాబుతో భేటీ అయిన నాలుగు రోజుల్లోనే గాంధి తన నిర్ణయానికి పూర్తి విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు ? ప్రకాష్, గాంధీలే కాదు బీఆర్ఎస్ కు చెందిన మరో ఆరుగురు ఎంఎల్ఏలు కూడా ఒకటిరెండు రోజుల్లోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్ళు ఇప్పటికే మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. శ్రీధర్ బాబుతో భేటీ అవ్వటం పెద్ద విషయం కాదుకాని వీళ్ళంతా చంద్రబాబుతో భేటీ అయినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరేది లేదని చెప్పిన ఎంఎల్ఏలే చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే హస్తంపార్టీలో చేరుతుండటం గమనార్హం. అందుకనే కొంతమంది ఎంఎల్ఏల చేరికలో బిగ్ బాస్ హస్తం ఉందా అనే అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి.




 ప్రకాష్, గాంధీ కాకుండా మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, ఆరెకపూడి గాంధి, మాగంటి గోపి, మర్రి రాజశేఖర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంత్రితో భేటీ అయ్యారు. వీళ్ళల్లో సుధీర్ రెడ్డి తప్ప మిగిలినందరు చంద్రబాబుకు హార్డ్ కోర్ మద్దతుదారులని అందరికీ తెలిసిందే. మంత్రితో భేటీ అయిన తర్వాతే చంద్రబాబుతో గాంధి భేటీ అయ్యారు. అంటే చంద్రబాబుతో భేటీ అయిన వాళ్ళల్లో ఇద్దరు ఎంఎల్ఏలు ప్రకాష్, గాంధీలు కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి మిగిలిన ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే కొందరు ఎంఎల్ఏల ఫిరాయింపుల్లో చంద్రబాబు పాత్రపైన అనుమానాలు పెరిగిపోతున్నాయి.

టీడీపీని తెలంగాణాలో బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు. తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నపుడు టీడీపీ బలోపేతం అయ్యేందుకు అవకాశాలు తక్కువే. అందుకనే ముందు బీఆర్ఎస్ ను సాంతం దెబ్బకొట్టి భూస్ధాపితం చేసేస్తే అప్పుడు ఆ ప్లేసులో ఎదిగేందుకు టీడీపీకి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ప్లేసును టీడీపీ భర్తీ చేసిన తర్వాత చంద్రబాబు వ్యూహాలు ఎలాగుంటాయో చూడాలి. అప్పటివరకు బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు ఎంతవీలుంటే అంతా చంద్రబాబు ప్రయత్నిస్తారనటంలో సందేహంలేదు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే బీఆర్ఎస్ లోని తన హార్డ్ కోర్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లోకి వెళ్ళేట్లుగా చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News