చంద్రబాబు తన తోబుట్టువులకి అన్యాయం చేశారా? వైసీపీ ఈ ఎదురుదాడేంటీ?
చంద్రబాబు తన తోడబుట్టిన వాళ్లకి అన్యాయం చేశాడంటూ వైసీపీ ఎందుకు విమర్శిస్తోంది. బాబునూ బయటకు లాగుతామని ఎందుకు అంటోంది? చంద్రబాబు తన తోబుట్టువులకుఏమీ ఇవ్వలేదా?
By : The Federal
Update: 2024-11-05 09:26 GMT
రాజకీయ నాయకులు ఎంత బాగా తిట్టుకుంటే అంత బాగా నిజాలు జనానికి తెలుస్తాయట. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ నేతలు- గతాన్ని తొవ్వుకుంటున్న తీరు చూస్తుంటే 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండు అననా'- అన్నట్టుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మకు అప్పుడెప్పుడో జరిగిన రోడ్డు ప్రమాదం వెనుక కుట్ర ఉందని టీడీపీ వాళ్లు ఆరోపిస్తుంటే.. ఎన్టీఆర్ మొదలు హరికృష్ణ, ఆయన కుమారుడు మరణాల వెనుక చంద్రబాబు చేసిన కుట్ర ఉందా అని వైసీపీ నేతలు ప్రత్యారోపణ చేస్తున్నారు. మొత్తం మీద 'లోగుట్టు పెరుమాళ్ల కెరుకన్నట్టుగా' ఈ తరానికి తెలియని అనేక పాత సంగతులు పాతరలోంచి బయటకు వస్తున్నాయి.
అన్నా చెల్లి ఆస్తులతో మొదలై...
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న దశలో వాళ్లమ్మ, వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయమ్మ సుదీర్ఘ లేఖ రాయడం, అది కుమార్తె షర్మిలను సమర్థించేలా ఉందంటూ జగన్ అనడం, ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందంటూ వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. దీనికి కౌంటర్ గా టీడీపీ వాళ్లు ఏవేవో అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా ఈసారి ఏకంగా వైఎస్ విజయమ్మను హత్య చేసేందుకు జగన్ కుట్ర పన్నాడని తెలుగుదేశం పార్టీ సంచలన ట్వీట్ చేసింది.
గతంలో వైఎస్ విజయమ్మ కాన్వాయ్‌కు జరిగిన ప్రమాదాన్ని టీడీపీ వెలుగులోకి తీసుకువచ్చింది. 'ఆ ప్రమాదం యాధృచ్చికమా? లేకా పక్కా ప్రణాళిక?' అంటూ టీడీపీ సందేహం వ్యక్తం చేసింది. '2019 ఎన్నికల్లో బాబాయ్‌ను చంపినట్లు.. ఈ ఎన్నికల్లో (2024) విజయమ్మపై స్కెచ్ వేశారా?' అంటూ టీడీపీ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. విజయమ్మ కారు రెండు టైర్లు పగిలిపోయిన వీడియోను టీడీపీ షేర్ చేసింది. ఆస్తి కోసం తల్లి విజయమ్మ, చెల్లె వైఎస్ షర్మిలను కోర్టుకు లాగిన వ్యక్తికి ఇదో పెద్ద విషయమై ఉండకపోవచ్చునని ఎద్దేవా చేసేలా ఆట్వీట్ ఉంది. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ కుటుంబం జోలికొస్తే ఊరుకోబోమని, తాము కూడా చంద్రబాబు గతాన్ని బయటకు లాగి బజార్లో పెడతామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేతలు ఏమన్నారంటే...
"ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైఎస్ జగన్ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి సీఎం చంద్రబాబు పబ్బం గడుపుకొంటున్నారు. ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైఎస్ జగన్ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేయిస్తున్నారు. దీన్ని పట్టుకుని కొన్ని పత్రికు కధనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయం. ప్రజలను కుటుంబ సభ్యుల్లా, మహిళలను తోబుట్టువుల్లా చూసుకున్న మాజీ సీఎం జగన్, తల్లి హత్యకు కుట్ర చేశాడంటూ వస్తున్నవన్నీ అసత్య కథనాలే" అని రాచమల్లు అన్నారు.
"చంద్రబాబు మామ ఎన్టీఆర్ మరణం, ఆయన బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో ఓ సినీ రంగ ప్రముఖునిపై కాల్పులు, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కూడా కుట్రలేనా?" అని ఆయన గట్టిగానే ప్రశ్నించారు. వీటినీ తాము ప్రచారం చేయాల్నా? వాటన్నింటికీ తామూ లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.
చిరంజీవి కూతురు ఏమందో గుర్తు చేయాల్నా?
పనిలో పనిగా రాచమల్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూ ఓ హెచ్చరిక చేశారు. ప్రముఖ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రస్తావించారు. "తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో చిరంజీవి కూతురు మీడియాతో మాట్లాడిన విషయాన్ని కూడా లింక్ పెట్టేలా చేసుకోవద్దని" హెచ్చరించారు. వ్యక్తిగత, కుటుంబ వివాదాలను రాజకీయాల్లోకి లాగవద్దని అంటూనే అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్ కుటుంబ వ్యవహారాలను సుదీర్ఘంగా ప్రస్తావించారు.
షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామని పవన్‌కళ్యాన్ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పాలంటూ 'షర్మిలమ్మకు భద్రత కల్పిస్తామంటూ ఎందుకు కొత్త డ్రామా? రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కదా?' అని ప్రశ్నించారు. 5 నెలల కూటమి పాలనలో 78 మంది అమాయక ఆడబిడ్డలు, మహిళలు అత్యాచారాలకు గురై చనిపోతే వారికెందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు.
తోబుట్టువులకు చంద్రబాబు ఇచ్చిన ఆస్తులెన్ని?
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్న చంద్రబాబు, తన సోదరి హైమవతి, తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఎన్ని కోట్ల ఆస్తులు పంచాడు? హెరిటేజ్‌లో ఎన్ని వేల షేర్లు రాసిచ్చాడో? చెప్పాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చివరకు కన్నతండ్రికి కూడా చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించలేదని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.
దీనికి ఇంకో నాలుగు అంశాలు జోడించి టీజేఆర్ సుధాకర్ బాబు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
మీ వదిన, బామ్మర్దితో మీకు సఖ్యత ఉందా?
ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన విజయమ్మ కారు ఘటన వెనుక కుట్ర కోణం ఉందనడాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఖండించారు. తాము చంద్రబాబు, పవన్‌కళ్యాన్ కుటుంబాల్లో జరిగిన ప్రమాదాలు, వివాదాలను బయటకు లాగితే తట్టుకోలేరన్నారు. చంద్రబాబుకు ఇటీవలి వరకు నందమూరి కుటుంబంతో ఏ మాత్రం సఖ్యత లేదని, ఇప్పటికీ తన సొంత కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని ఆరోపించారు.
"గత ఎన్నికలకు కొన్నాళ్ల ముందు వరకు చంద్రబాబుకు ఆయన వదిన పురందేశ్వరీ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పడేది కాదు. బావమరిది హరికృష్ణతోనూ గొడవలున్నాయి. చివరకు తన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు రామ్మూర్తినాయుడుతో కూడా చంద్రబాబుకి సఖ్యత లేదు. అసలు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చంద్రబాబు చెప్పాలి. ఎవ్వరితోనూ సయోధ్య లేని చంద్రబాబు, వైఎస్ కుటుంబ వ్యవహారాలపై విమర్శలు చేయడం ఎందుకు? అన్నారు.
మరి అవి కూడా కుట్రలేనా?:
'రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ, ఆయన కుమారుడు జానకిరామ్ దుర్మరణం, ఎన్నికల ప్రచారం చేసి తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, ఇటీవల చంద్రబాబు ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య.. అవన్నీ కుట్రలేనా?' అని సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటి వెనక చంద్రబాబు హస్తముందని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. ఇంకా టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా కారు ప్రమాదాల్లో చనిపోవడం కూడా కుట్రేనా? అన్నారు సుధాకర్‌బాబు.
బాబూ, నీవేం ఆస్తులు పంచి ఇచ్చావ్?
షర్మిలమ్మకు జగన్ రాజకీయంగా పార్టీలో స్థానం ఇవ్వలేదని, ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని విమర్శించిన చంద్రబాబు.. తన ఇద్దరు చెళ్ళెళ్లకు, తమ్ముడికి ఇచ్చిన ఆస్తులెన్ని? హెరిటేజ్ కంపెనీలో ఇచ్చిన షేర్లు ఎన్నో బయట పెట్టాలని సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు.
చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడికి మధ్య గొడవలున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలే చేశారు. ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతోనూ గొడవలున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయినపుడు గానీ ఆ తర్వాత గానీ జూనియర్ఎన్టీఆర్ ఆయన్ను పరామర్శించలేదు. ప్రతి కుటుంబంలో ఉన్నట్టే మా మధ్యా కొన్ని విభేదాలు ఉన్నాయని ఆవేళ కొందరు సర్ధిచెప్పాలని చూశారు.
ఏది ఏమైనా రాజకీయ నేతల బాగోతాలు, అసలు స్వరూపాలు ఇప్పుడు బయటకు రావడం గమనార్హం.