చంద్రబాబు ఆటో ‘షో’
సామాన్య మానవుడిగా సీఎం చంద్రబాబు ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్య పరిచారు.;
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటోలో ప్రయాణించి షో చేశారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గూడెంచెరువులో శుక్రవారం ఆయన ఉల్పాల అలివేలమ్మ అనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి లబ్ధిదారు అలివేలమ్మ చిన్న కుమారుడు జగదీష్ ఆటోలో ప్రజావేదిక వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లారు. తన కాన్వాయ్‌ను కాదని ఆటోలో ఓ సామాన్య మానవుడిగా ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ జగదీష్‌తో మాట్లాడుతూ ప్రజావేదిక వద్దకు చేరుకున్నాక అప్పటి వరకు ఆటోలో వెనుక సీటులో కూర్చొని ప్రయాణించిన సీఎం చంద్రబాబు కిందకు దిగి వెంటనే ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని, అతని భుజంపై చేయి వేసి ఆ ఆటో డ్రైవర్‌తో ముచ్చటించారు.
అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చారు. తర్వాత ఆటో డ్రైవర్‌తో మాట్లాడి అతడి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అక్కడున్న అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణించినందుకు కొంత మొత్తం నగదును ఆ ఆటో డ్రైవర్‌కు సీఎం చంద్రబాబు అందజేశారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆటోలో ఎక్కి ప్రయాణించడమే కాకుండా ఒకే సీట్లో తన పక్కనే కూర్చున్నందుకు ఆ ఆటో డ్రవర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. అనంతరం సీఎం చంద్రబాబు కాళ్లకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.