అన్నమయ్యను చంద్రబాబు, జగన్ మోసం చేశారు
గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ తీరు వల్ల అన్నమయ్య ప్రాజెక్టు అనాథ ప్రాజెక్ట్‌గా మారిందని షర్మిల ధ్వజమెత్తారు.;
By : The Federal
Update: 2025-09-01 14:49 GMT
ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టును వీరిద్దరు మోసం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఈ డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా ఆమె డిమాండ్ చేశారు.
షర్మిల ఏమన్నారంటే..
అన్నమయ్య..ఇక అంతేనయ్య‘. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి 5ఏళ్లు దాటినా పునర్ నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికి ఆదుకున్నది లేదు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్ ను ‘అనాథ ప్రాజెక్ట్‘ కింద మార్చారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ. 800 కోట్లతో మరమత్తులు అంటూ హడావిడి తప్పా ప్రాజెక్ట్ ను కట్టింది లేదు. పునరుద్ధరణ పేరుతో 3 ఏళ్లు గడిపారే తప్పా... తట్టెడు మట్టి వేయలేదు. బాధిత కుటుంబాలకు ఇల్లు అందలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలనీ, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్పా జగన్ ఉద్ధరించింది శూన్యం.
అధికారంలో వచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కడతామని చెప్పి సీఎం చంద్రబాబు చేస్తుంది మోసమే. రాజంపేటకు రెండు సార్లు వచ్చి పోయినా ప్రాజెక్ట్ పనులకు మోక్షం లేదు. రూ. 340 కోట్లతో మరమత్తులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో బాబు గారు సైతం కాలయాపన చేస్తున్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్పిస్తే ప్రాజెక్ట్ నిర్మాణంపై దిశా – నిర్దేశం లేకపోవడం శోచనీయం.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత 5 ఏళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు పారడం లేదు. లక్షమందికి త్రాగునీరు అందడం లేదు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తి స్థాయి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం.. అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
"అన్నమయ్య..ఇక అంతేనయ్య". ప్రాజెక్ట్ కొట్టుకు పోయి 5ఏళ్లు దాటినా పునర్ నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికి ఆదుకున్నది… pic.twitter.com/J81sllsTR0
— YS Sharmila (@realyssharmila) September 1, 2025