క్యాబినెట్ లెక్కలు: చంద్రబాబు కూడికలు, తీసివేతలివే...

చంద్రబాబు 4.0 మంత్రివర్గం ప్రమాణాలు చేసి అధికారం లోకి వచ్చింది. కొందరు సీనియర్లు, మరి కొందరు కొత్త వారితో రూపొందించిన మంత్రి వర్గంలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమతూకం చాలావరకు పాటించినట్లే కనిపించింది.

Update: 2024-06-12 10:15 GMT

చంద్రబాబు 4.0 మంత్రివర్గం ప్రమాణాలు చేసి అధికారం లోకి వచ్చింది. బుధవారం ఉదయం విజయవాడ శివార్లలోని కేసరపల్లి గ్రౌండ్స్ లో జరిగిన వేడుక అసాధారణం, అనుపమానమనే చెప్పాలి. త్రిపక్ష కూటమి ఇటీవల సాధించిన అఖండ విజయంచంద్రబాబు 4.0 మంత్రివర్గం ప్రమాణాలు చేసి అధికారం లోకి వచ్చింది. గుర్తులు అడుగడుగునా కనిపించేలా నిర్వహించారు.


ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, చిరంజీవి, రజనీకాంత్, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు... కొలువు దీరగా, వేలాది అభిమానుల హర్షధ్వానాల మధ్య కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముందుగా పలువురు భావించినట్లు టిడిపి లోని సీనియర్లు చాలా మందికి కొత్త కేబినెట్ లో చోటు లభించక పోవడం ఒక విశేష మైతే, కొత్తవారు 17 మందికి మంత్రి పదవులు లభించడం మరో విశేషం. కొందరు సీనియర్లు, మరి కొందరు కొత్త వారితో రూపొందించిన మంత్రి వర్గంలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమతూకం చాలావరకు పాటించినట్లే కనిపించింది.


ముఖ్యమంత్రి గాక మిగిలిన 24 మంది మంత్రులలో ముగ్గురు మహిళలకు కూడా చోటు లభించింది. బిసిలు 8 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరు, వైశ్యుల నుంచి ఒకరికి పదవులు లభించాయి. సామాజిక వర్గాల మధ్య సమతూకం పాటించినా, కొన్ని సామాజిక వర్గాలకు ఇంకా ప్రాతినిధ్యం లభించలేదనే విమర్శలు కూడా అప్పుడే వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రి వర్గాన్ని సిద్ధం చేసినట్లు టిడిపి అధిష్టానం చెబుతున్నా... జనసేనకు ఇంకా తగినంత ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం కూడా కొందరి నుంచి వినిపించింది. పవన్ కళ్యాణ్ గాక మరో నలుగురికి కేబినెట్ లో చోటు లభించగలదని తొలుత అనుకున్నారు కానీ చివరికి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కు లభించగలదని ముందునుంచి అందరూ అనుకున్నదే. వారిద్దరు గాక నిడదవోలు ఎమ్మెల్యే అయిన కందుల దుర్గేష్ కు మాత్రమే కేబినెట్ లో స్థానం లభించింది.


మంత్రి వర్గంలో బిసిలకు, మహిళలకు పెద్దపీట వేస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చిన చంద్రబాబు చాలా వరకు మాట నిలబెట్టుకున్నారనే చెప్పాలి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా 8 మంది బిసిలకు మంత్రి పదవులు ఇచ్చి వారికి పెద్దపీట వేశారు. అయితే మహిళలు ముగ్గురికి మాత్రమే లభించడం పట్ల కూడా కొంత అసంతృప్తి వినిపిస్తోంది. టిడిపి మహిళా అధ్యక్షురాలైన వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి తో పాటు కొత్తగా ఎన్నికైన సవితకు మంత్రి పదవులు లభించాయి. పవన్, దుర్గేష్, సవిత వంటి తొలిసారి ఎమ్మెల్యేలు అయిన 8 మందికి చోటు లభించడం కూడా విశేషమే.


సామాజిక వర్గాలకు సంబంధించి చూస్తే కాపు, కమ్మవారికి చెరి నాలుగు పదవులు లభించగా, రెడ్డి సామాజిక వర్గంలో ముగ్గురికి లభించాయి. కమ్మవారిలో లోకేష్, నాదెండ్ల, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ ఉండగా, కాపు సామాజిక వర్గంలో పవన్, నారాయణ, నిమ్మల, దుర్గేష్ ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డితో పాటు జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఎస్సీ కోటాలో అనిత, బాల వీరాంజనేయస్వామి ఎస్టీ కోటాలో సంధ్యారాణి మైనారిటీ కోటాలో మాజీ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, ఆర్య వైశ్య వర్గం తరఫున టిజి వెంకటేష్ కుమారుడైన టిజి భరత్ కు పదవులు దక్కాయి.


అసెంబ్లీలో 175 సీట్లుండగా, త్రిపక్ష కూటమికి 164 సీట్లున్నాయి. వాటిలో టిడిపికి 135, జనసేనకు 21, బిజెపికి 8 సీట్లు వచ్చాయి. ఆ దామాషా ప్రకారమే మంత్రి పదవులు కేటాయించినట్లు చెబుతున్నా జనసేన నేతల్లో మాత్రం కొంత అసంతృప్తి వినిపిస్తోంది. అయితే మంత్రి వర్గంలో స్థానం లభించని కొందరికి ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టిడిపి లో కూడా మంత్రి పదవులు లభించని చాలామంది సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసమే ఇక ఎదురు చూస్తారు. బహుశా వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కమిటీల చైర్మన్ పదవులు లభించవచ్చు. నాయకులకు పునరావాసం కోసం గత జగన్ ప్రభుత్వం దాదాపు 40 మందికి ఏదో ఒక సలహాదారు పదవులు పంచిపెట్టింది. అలా చాలామందిని చేయి జారిపోకుండా నిలుపుకొంది. అయితే టిడిపి ప్రభుత్వంలో అటువంటి సలహాదారు పోస్టులు ఉండవనే అంటున్నారు.


  2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత పుట్టెడు సమస్యలతో 13 జిల్లాల నవ్యాంధ్ర ఏర్పడింది. తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు సరైన రాజధాని అడ్రస్ కూడా లేకపోవడం విచారకరమే. చంద్రబాబు ప్రభుత్వం తొలుత ఈ అంశంపై శ్రద్ధ వహించాలి. మంగళవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ప్రసంగాన్ని బట్టి ఆయన తొలి ప్రాధాన్యం అమరావతి నగర నిర్మాణమే అని భావించాలి. అయితే దానికి చాలా అవరోధాలు ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి వెళ్లాలి. అలాగే 2014 లో టిడిపి నవ్యాంధ్ర తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉన్న సమస్యలే నేటికీ ఉండడంతో ముందుగా వాటి జాబితా క్షుణ్ణంగా తయారుచేసుకొని కొత్త మంత్రులందరికి వాటిపై అవగాహన కలిగించే చర్యలు కూడా తీసుకోవాలి. అప్పుడే వాటికి కొంతవరకైనా పరిష్కారాలు లభిస్తాయి.

Tags:    

Similar News