కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలకు బడ్జెట్ షాక్

బడ్జెట్లో తెలంగాణా గురించి మంత్రి నిర్మల పట్టించుకోకపోతే కిషన్, బండితో పాటు ఎంపీలు జనాలందరికీ మాధానాలు చెప్పాల్సుంటుంది.

Update: 2024-07-24 07:32 GMT

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తెలంగాణా రాష్ట్రానికే కాకుండా కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలకు కూడా పెద్ద షాకే ఇచ్చింది. బడ్జెట్లో తెలంగాణాకు అవసరమైన డిమాండ్లన్నింటినీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మూడుసార్లు నరేంద్రమోడిని కలిసి విజ్ఞప్తిచేశారు. అలాగే ఇతర కేంద్రమంత్రులను చాలాసార్లు కలిసి వినతిపత్రాలను అందించారు. బడ్జెట్లో కేటాయింపుల కోసం రేవంత్ తరపున ఇన్ని ప్రయత్నాలు జరిగినా నరేంద్రమోడి మాత్రం పట్టించుకోలేదు. మొత్తం బడ్జెట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణా ప్రస్తావనే తేలేదు. తెలంగాణాలో ఉన్న కేంద్రప్రభుత్వ సంస్ధలకు నిధులు కేటాయించిన నిర్మల తెలంగాణా రాష్ట్రానికి చేసిన కేటాయింపులు గుండుసున్నా.

తెలంగాణా నుండి బీజేపీ తరపున జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేంద్రమంత్రులుగా ఉన్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు మరో ఆరుగురు లోక్ సభ ఎంపీలున్నారు. వీళ్ళు కాకుండా ఎనిమిది మంది ఎంఎల్ఏలున్నారు. కేంద్రబడ్జెట్లో ఎంఎల్ఏల ప్రత్యక్ష పాత్ర ఏమీ ఉండకపోయినా కేంద్రమంత్రులు, ఎంపీలు రాష్ట్రాభివృద్ధికి ప్రతిపాదనలు పంపించవచ్చు. ఎంఎల్ఏలు కూడా ప్రతిపాదనలు అందించినా ఎంపీలు, కేంద్రమంత్రులిచ్చిన ప్రతిపాదనలకు ఎక్కువ విలువుంటుంది. మరి ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు ఎంపీలు తెలంగాణా ప్రయోజనాల విషయంలో ఏమిచేస్తున్నట్లు ? తెలంగాణా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇవి, అని కేంద్రమంత్రులు గాని ఎంపీలు గాని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు ఏమన్నా ప్రతిపాదనలు అందించారా లేదా అన్న విషయం కూడా తెలీదు. ప్రతిపాదనలు అందించినట్లుగా కేంద్రమంత్రులుగాని ఎంపీలు కాని మీడియాలో ఎక్కడా చెప్పలేదు.

తన బడ్జెట్లో తెలంగాణా గురించి మంత్రి నిర్మల పట్టించుకోకపోతే కిషన్, బండితో పాటు ఎంపీలు ఏమిచేస్తున్నారో అర్ధంకావటంలేదు. ఈ విషయంలో జనాలందరికీ కేంద్రమంత్రులు, ఎంపీలు సమాధానాలు చెప్పాల్సుంటుంది. ఐటిఐఆర్, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరి, ఐఐటి, రీజనల్ రింగ్ అభివృద్ధికి నిధులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలనే డిమాండ్లను రేవంత్ వినిపించారు కాని కేంద్రమంత్రులు, ఎంపీలు మాత్రం నోరెత్తలేదు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం అంత చేస్తోంది ఇంతచేస్తోందని చెప్పే కిషన్ రెడ్డి మరి తాజా బడ్జెట్ విషయమై మాత్రం ఏమీ మాట్లాడటంలేదు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామని తరచూ చెప్పుకుంటున్న కిషన్, బండి, లక్ష్మణ్ తదితరులు ఇపుడు జనాలకు ఏమి సమాధానం చెబుతారు ?

తెలంగాణా విషయంలో నరేంద్రమోడి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న రేవంత్ వ్యాఖ్యలను జనాలు అంగీకరిస్తున్నారు. లేకపోతే రేవంత్ పది డిమాండ్లు ఇచ్చినపుడు అందులో అన్నీ కాకపోయినా కనీసం రెండు మూడింటి విషయంలో అయినా సానుకూలంగా స్పందించాలి కదా ? బడ్జెట్లో వాటికి కేటాయింపులు చూపించాలి కదా. అపుడే తెలంగాణాపై మోడి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే విమర్శలకు ఫులిస్టాప్ పెట్టినట్లవుతుంది. కాని మోడి ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసినట్లు కనిపించటంలేదు. అందుకనే బడ్జెట్లో తెలంగాణాను పూర్తిగా పక్కనపెట్టేసింది. మరిపుడు కిషన్, బండి ఎలా సమర్ధించుకుంటారు ?

బడ్జెట్ మీద కిషన్ మాట్లాడుతు ఆత్మనిర్భర భారత్ నిర్మాణం లక్ష్యంగా మోడి ప్రభుత్వం సమతుల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. వీధి వ్యాపారుల నుండి రైతులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కల్పించటమే బడ్జెట్ ఉద్దేశ్యమంగా చెప్పారు. 4 కోట్ల యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఇలాంటి చాలా విషయాలు మాట్లాడురు కాని తెలంగాణాకు జరిగిన అన్యాయంపైన మాత్రం నోరిప్పలేదు. అలాగే మరో మంత్రి బండి సంజయ్ మాట్లాడుతు 2047 నాటికి భారత్ ను ఆర్ధిక ప్రగతిలో నెంబర్ 1 గా చూడాలన్నదే బడ్జెట్ ఉద్దేశ్యమన్నారు. మౌళిక సదుపాయాల కల్పనకు రు. 11 లక్షల 50 కోట్లు కేటాయించి దేశహితం కోరే బడ్జెట్ గా బండి వర్ణించారు. బడ్జెట్లో వ్యవసాయం, విద్యకు పెద్దపీట వేసినట్లు బండి చెప్పారుకాని తెలంగాణాకు జరిగిన అన్యాయంపైన మాత్రం మాట్లాడలేదు. బీజేపీ కేంద్రమంత్రులుగా, ఎంపీలుగా బడ్జెట్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి వీళ్ళు ఇబ్బందిపడుతుంటే తెలంగాణాలో బీజేపీ బలోపేతానికి జనాలు ఎందుకు సహకరిస్తారు ? ఎందుకు సహకరించాలి ? తెలంగాణా విషయంలో ఇంత వివక్ష చూపిస్తున్న నేపధ్యంలో సొంతంగానే అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నేరవేరుతుందా ?

Tags:    

Similar News