వైజాగ్ స్టీల్‌పై కేంద్రం ఫోకస్.. ప్రైవేటీకరణ చేయడానికేనా..!

విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విశాఖ ఉక్కును మళ్ళీ లాభాల బాట పట్టించాలని చర్యలు చేపడుతుంది. ఈ చర్యలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Update: 2024-07-09 14:02 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, కేంద్రం ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏదైనా అంశం ఉందంటే అది విశాఖ ఉక్కనే చెప్పాలి. కొన్నేళ్లుగా విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి శ్రామికుల, ప్రజలకు పోరాడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కేంద్రంపై తిరుగుబావుటా ఎగరేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవాలని ఆంధ్రులు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపుతోంది. అందులో భాగంగానే మోడీ క్యాబినెట్‌లోని ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. విశాఖకు రావాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం.

సమస్యలు నెరవేరతాయా..

కేంద్రమంత్రి కుమారస్వామి.. బుధవారం విశాఖకు విచ్చేయనున్నారు. అక్కడ అధికారులతో చర్చించిన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. హైదరాబాద్‌లో ఎన్ఎం‌డీసీ అధికారులతో సమీక్ష నిర్వహించి అందులో.. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం చర్చించనున్నారు. అదే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే విశాఖ ఉక్కును మళ్ళీ లాభాల బాట పట్టించవచ్చు అన్న అంశాలపై కూడా ఆయన చర్చించనున్నారని, వాటిపై అధికారుల, నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్నారని సమాచారం.

విలీనం చేయమంటున్న పోరాట కమిటీ

కాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్‌లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉక్కు బాధ్యతను తాము తీసుకుంటామని కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో కేంద్రమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు? అనేది కీలకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వీటిపైనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఆదేశాలిచ్చిన మంత్రి

అయితే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. విశాఖ ఉక్కు కర్మాగార ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటుగా కంపెనీకి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని కూడా చెప్పారు. విశాఖ ఉక్కును మళ్ళీ లాభాలా బాట పట్టించడంతో పాటు ఆర్థికంగా పునరుత్తేజం కల్పించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖ ఉక్కు.. ఉత్పత్తి, సామర్థ్యం, ఆర్థిక స్థితి, కార్యకలాపాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కును తిరిగి గాడిలో పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని కుమారస్వామి ప్రకటించారు. ఏడాదికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, దానిని అందుకోవాలంటే విశాఖ ఉక్కు సామర్థ్యం గణనీయంగా పెరగాలని కుమారస్వామి వెల్లడించారు. ఆ దిశగా చర్యలు చేపట్టానికి ముందుగా విశాఖ ఉక్కు సమస్యలు పరిష్కరించాలని, వాటి కోసమే ఆయన విశాఖ పర్యటనలకు బయలుదెరారని తెలుస్తోంది.

ప్రవేటీకరణ చేయడానికే ఈ చర్యలా

ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు.. కేంద్రం ఒక్కసారిగా విశాఖ ఉక్కుపై ఫోకస్ పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను ఆపడానికి ఫోకస్ పెట్టిందా లేకుండా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకోవడానికా అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏ ప్రైవేటు సంస్థ కూడా పెద్ద మొత్తంలో చెల్లించదని, అందుకే విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించి అప్పుడు ప్రైవేటీకరణ చేస్తే భారీ మొత్తంలో పోగేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే కేంద్రం ఒక్కసారిగా విశాఖ ఉక్కుపై ఇంత ఆసక్తి చూపుతుందా అని అనుమానిస్తున్నారు. అందుకనే ఇన్నాళ్లూ పోరాటం చేసినా రాని కేంద్ర మంత్రి ఇప్పుడు విశాఖ పర్యటనకు వస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News