ఉద్యోగులపై కేసులు త్వరగా పరిష్కరించాలి
ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలివ్వాలని పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.;
By : Admin
Update: 2025-01-17 15:29 GMT
ఉప ముఖ్యమంత్రి వపన్ కల్యాణ్ తన శాఖల పరిధిలోని ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ కేసుల మీద దృష్టి సారించారు. ఈ కేసులకు సంబంధించి శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటి వివరాలేమిటో సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలి. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుంది. అయితే ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.
కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం పవన్ కల్యాణ్ దృష్టి్టకి వచ్చింది. ఈ విధంగా కేసులు పరిష్కారం కాని కారణంగా అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేదు. సిబ్బంది తమ ఉద్యోగ కాల పరిమితిలో పదోన్నతుల్లోనూ వెనుకబడిన వారున్నారని పవన్ కల్యాణ్ గుర్తించారు. ఈ క్రమంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినపుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదనీ, ఇది విచారణ జాప్యానికి కారణం అవుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్భందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలోనూ బలమైన సాక్ష్యాలు సేకరించాలని, విచారణాధికారికి, ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని ఆదేశించారు.