సోషల్ మీడియా కట్టడికి క్యాబినెట్ సబ్ కమిటీ
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది.
By : The Federal
Update: 2025-10-01 18:16 GMT
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, హానికరమైన పోస్టులను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై అధ్యయనం చేసి, తగిన చర్యలు సూచించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్–కమిటీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉపసంఘం సభ్యులుగా మంత్రి నారా లోకేశ్, వంగలపూడి అనిత, వై. సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథిలను నియమించింది. ఏడు ముఖ్యమైన అంశాలపై లోతైన అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుత సోషల్ మీడియా చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను సమీక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై జవాబుదారీతనం, బాధ్యతలు, నియంత్రణ చర్యలు, అంతర్జాతీయ పద్ధతులు, పారదర్శక ప్రమాణాలు, వినియోగదారుల రక్షణ, హానికర కంటెంట్ నివారణ, తప్పుడు సమాచారం నిరోధం, పోస్టులపై ఫిర్యాదులు, పరిష్కారాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. పౌర హక్కుల రక్షణకు తగిన చర్యలు సూచించేందుకు మంత్రుల కమిటీ సలహాలు ఇవ్వనుంది. సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న తప్పుడు సమాచారం, అసభ్య పోస్టులు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మరిన్ని చట్టాలు లేదా నియమాలు తీసుకురానుంది.