అదానీ పవర్‌ కంపెనీల కోసం భూ కేటాయింపులు–కేబినెట్‌ కీలక నిర్ణయం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.;

Update: 2025-05-20 10:52 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గౌతమ్‌ అదానీ పవర్‌ కంపెనీలకు తక్కువ ధరలకు రాష్ట్రంలో భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తాడిమర్రిలో 500 మెగావాట్లు, కొండాపురంలో మరో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు భూములు కేటాయించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రూ. 5లక్షలకు ఎకరం చొప్పున అదానీ పవర్‌ కంపెనీలకు భూములు కేటాయించాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం అమరావతి సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాల భూమిని కేటాయించాలనే నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పాటుగా ఇక్కడ ఒక ఇండస్ట్రీయల్‌ పార్కును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వ్యవసాయం, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు వంటి కీలక అంశాలపైన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది పంటల దిగుబడులు బాగా పెరిగినా, జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న అనేక కారణాల వల్ల పంటల ధరలపై పడిన ప్రభావం, గిట్టుబాటు ధరలు గురించి ఈ సందర్భంగా అధికారులు వివిరించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి పొగాకు, మిర్చి, అక్వా, చెరకు, మామిడి వంటి పంటలకు ఎందుకు గిట్టుబాటు ధరలు తగ్గాయనే దానిపైన సీఎం చంద్రబాబుకు, కేబినెట్‌కు వివరించే ప్రయత్నం చేశారు. దీనిపైన స్పందించిన సీఎం చంద్రబాబు ధరలపైన ప్రత్యేక సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించారు.

వ్యవసాయ దిగుబడులతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు, నిత్యావసర సరుకుల ధరలకు సంబంధించి ఆరుగురు మంత్రులతో కూడిన ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం రంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వివిధ పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలు దక్కేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ సబ్‌ కమిటీ పని చేస్తుందని తెలిపారు. నితం్య ఈ అంశాలపై ఈ సబ్‌కమిటీ పర్వవేక్షణ చేస్తుందని తెలిపారు.

విద్యా రంగం, ఉపాధ్యాయ పోస్టులపై చర్చించిన కేబినెట్‌ రాష్ట్రంలో 2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలనే ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోనే ఉండిపోయిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొని రావాలనే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భోగాపురం వద్ద 500 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టుకు కేటాయించాలని మంత్రుల బృందం సమావేశం ముందుకు తీసుకొచ్చిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. ఏపీలో పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు అవసరమైన స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీకి అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా లీగల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదలను కేబినెట్‌ ఆమోదించింది. వ్యాన్‌ల ద్వారా కాకుండా రేషన్‌ షాపుల ద్వారానే రేషన్‌ అందించాలనే పాత విధానం అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ లెదర్‌ ఫుట్‌వేర్‌ పాలసీ 40.0కి మంత్రి వర్గ సమావేశం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ. 30వేల కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంస్థలు ఏర్పాటు చేసే కంపెనీల ద్వారా 30వేల ఉద్యోగాలు కల్పించాలనే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన 11 కంపెనీలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 
Tags:    

Similar News