‘అప్పులు మీరే కడతారా’.. బాబును నిలదీసిన బుగ్గన

ప్రతిపక్షాలపై వైసీపీ మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన అప్పులు వీరే కడతారా అంటూ ప్రశ్నించారు.

Update: 2024-05-04 09:44 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలతో వేడివేడిగా సాగుతున్నాయి. రాష్ట్రాన్ని మీరు నాశనం చేశారంటే మీరంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐదేళ్లలో వైసీపీ.. స్వర్ణాంద్రను అప్పుల ఆంధ్రగా మార్చేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో అన్నారు.  అంతేకాకుండా వాళ్లు చేసిన అప్పులు వాళ్లే కట్టాలని కూడా తాజాగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా కూడా మారాయి. తాజాగా వాటిపై వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘మేము తెచ్చిన అప్పులు మేమే కట్టాలంటే.. గతంలో మీ ప్రభుత్వం చేసిన అప్పులను మీరే కడతారా?’’అని నిలదీశారు. ఈ అంశంపై ఆయన మీడియాతో చర్చించారు. బాబు ఏం మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పులు నేనే కట్టాలా?

‘‘నేను చేసిన అప్పులను నేనే కట్టాలా? అయితే గతంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పులను మీరే కడతారా? అంతేకాదు నా వెంట వస్తే ఈ ఐదేళ్లలో నేను చేసిన అభివృద్ధిని చూపిస్తాను. అదే విధంగా మీ వెంట నేను వస్తా.. మీరు ఏం అభివృద్ధి చేశారో చూపుతారా?’’ అని ఛాలెంజ్ చేశారు. టీడీపీ నేత ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరించొచ్చని అన్నారు. డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

మంత్రిగా మీరు ఏం సాధించారు?

ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన బుగ్గన.. ప్రతిపక్ష టీడీపీ పార్టీకి సవాళ్లపైన సవాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే కోట్ల ప్రకాష్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఆయన ఒకరోజు డోన్, పులివెందుల తప్ప మరేమీ అభివృద్ధి కాలేదంటారని, మరుసటి రోజే అసలు అభిృద్ధనేదే రాష్ట్రంలో కనిపించడం లేదని అంటారని, 75 ఏళ్ళ దాటినా రాజకీయాల్లో ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుంది’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘నా ఎన్నికల నామినేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తారా. డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలులో కలుపుతారా? సంద్యాలలో కలుస్తున్నప్పుడు అధికారంలో ఉంది మీరే కదా? అప్పుడు ఏం చేశారు’’అని నిలదీశారు.

మద్యం సిండికేట్లు నడిపింది మీరు కాదా!

‘‘నాపై ఆర్థిక నేరారోపణలు చేస్తారా? మీరు మద్యం సిండికేట్లు నడిపి 60-40 అంటూ పంచుకోలేదా. మీరు వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో మరోసారి వెనకడుగు వేయనుంది. టీడీపీ వాళ్ళు పిచ్చోళ్లైనా ప్రజలు పిచ్చోళ్లు కాదని, ఎవరికి ఓటేయాలో ఓటర్లకు బాగా తెలుసని ఆయన వివరించారు.

Tags:    

Similar News